Intlo Deyyam Nakem Bhayam
-
ఎప్పుడు రిలీజైనా హిట్టే!
‘‘నాకు ఈ ఏడాది వ్యక్తిగతంగా చాలా ఆనందాన్నీ, వృత్తిపరంగా కాస్త అసంతృప్తినీ అందించింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన హారర్–కామెడీ ‘ఇంట్లో దెయ్యం... నాకేం భయం’. నవంబర్ 13న రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా నోట్ల రద్దు ప్రభావంతో వాయిదా పడి, ఈ నెల 30న థియేటర్లలోకి వస్తోంది. ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.. ♦ నోట్ల రద్దు దెబ్బకు ఆగిన ఫస్ట్ మూవీ మాదే. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న ప్రజలు థియేటర్లకు రావడం కష్టమనే ఉద్దేశంతో విడుదల వాయిదా వేశాం. ఎప్పుడు రిలీజైనా హిట్టయ్యే చిత్రమిది. ♦ పెళ్లికి బ్యాండ్ వాయించే కుర్రాడు అనుకోకుండా మంత్రగాడిగా మారితే ఏం జరిగిందనేది చిత్రకథ. ఇందులో దెయ్యం ఎప్పుడూ ఒకరిలో ప్రవేశించదు. నోటికి వచ్చిన మంత్రాలు చదువుతూ... కాసేపు భయపడుతూ, అప్పుడప్పుడూ భయపెడుతూ ప్రేక్షకుల్ని నవ్వించే పాత్ర చేశా. ♦ నిర్మాత ప్రసాద్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. భారీ సినిమాలు తీసే ఆయన, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఎక్కువమందికి పని దొరుకుతుంది. అందరికీ ధైర్యం వస్తుంది. జి. నాగేశ్వరరెడ్డితో మూడో చిత్రమిది. ఎలాంటి సినిమా చేయాలని చాలారోజులు ఆలోచించి ఈ కథ ఓకే చేశాం. ♦ పెళ్లైన తర్వాత బాధ్యత తెలుస్తుంది అంటుంటారు. కానీ, నన్ను అడిగితే.. పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యతలు తెలుస్తాయి. ఈ ఏడాది పాప పుట్టిన తర్వాత లైఫ్‌లో సంతోషం ఎక్కువైంది. అలాగే, ప్రతి ఏడాదీ నాలుగైదు సినిమాలు చేసే నేను ఈ ఏడాది ‘సెల్ఫీ రాజా’, ఇప్పుడీ సినిమా చేశానంతే. అది కొంచెం అసంతృప్తిగా ఉంది. ♦ ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్‌కృష్ణ దర్శకత్వంలో నటించనున్న ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా, కొత్త దర్శకుడు సతీశ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాను. 2020 నాటి వేసవిలో ఒక ప్రేమకథా చిత్రంతో నేను దర్శకుడిగా పరిచయమవడా నికి సిద్ధమవుతున్నా. -
హమ్మయ్య.. రిలీజ్ డేట్ చెప్పారు
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఓ వెలుగు వెలిగిన యంగ్ హీరో అల్లరి నరేష్, ప్రస్తుతం ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న ఈ అల్లరోడు, త్వరలో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నరేష్. అసలు ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. మొదట పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయన్న కారణంతో తరువాత నోట్ల రద్దుతో పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ నెల 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ ఉన్నారు.. నరేష్ అండ్ టీం. -
ఊహించని కాంబినేషన్
ఇటు కామెడీ.. అటు యాక్షన్.. వీటికి తోడు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు మేళవించి పసందైన విందు భోజనం లాంటి సినిమా ప్రేక్షకులకు అందించాలనుకునే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘ఇజం’ తర్వాత కల్యాణ్‌రామ్ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ‘దేనికైనా రెడీ’, ‘కరెంట్ తీగ’, ‘ఈడోరకం ఆడోరకం’.. ఇలా ఇటీవల జి.నాగేశ్వరరెడ్డి తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ‘‘దర్శకుడు చెప్పిన కథకు కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ‘దేనికైనా రెడీ’ తరహాలో సాగే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. భారీ సినిమాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాత.. కాస్త విరామం తర్వాత నిర్మించనున్న చిత్రమిది’’ అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అన్నట్లు... ఈ కాంబినేషన్‌ని ఎవరూ ఊహించరు కదూ. ఆ సంగతలా ఉంచితే, ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి తీసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ త్వరలో విడుదల కానుంది. -
ఒక్క రోజు ఆలస్యంగా..!
ఈ సారి సోలోగా సత్తా చాటాలనుకున్న అల్లరి నరేష్ ఆశలు మీద నాగచైతన్య నీళ్లు చల్లేశాడు. ఈ శుక్రవారం సోలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న నరేష్ కు అదే రోజు నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అవుతుండటంతో కాస్త ఇబ్బంది ఎదురైంది. దీంతో అనుకున్నట్టుగా శుక్రవారం కాకుండా ఒక్క రోజు ఆలస్యంగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నరేష్. ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో తడబడుతూ వస్తున్న యంగ్ హీరో నరేష్, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ అయిన హర్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ జి నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ శనివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నరేష్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. -
నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి
‘‘ప్రసాద్‌గారితో సినిమా అనుకున్నప్పుడు నరేశ్‌తో చేద్దామనుకున్నాం. ‘మన కాంబినేషన్లో మూడో సినిమా కాబట్టి, డిఫరెంట్‌గా ఉండాలి. హారర్ జోనర్ ఎందుకు ట్రై చేయకూడదు?’ అని నరేశ్ అన్నాడు. కొత్తగా ఉంటుందని ముందుకెళ్లాం. నరేశ్ ఒక కథల ఏటీఎం. కథాచర్చల్లో నేనో కథ చెబితే తను ఆరు చెప్పేవాడు’’ అని జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, కృతిక, మౌర్యానీ ముఖ్య తారలుగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నరేశ్ మాట్లాడుతూ-‘‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ వంటి కామెడీ మూవీస్ చేసిన నాకు, నాగేశ్వరరెడ్డికీ హారర్ జానర్ కొత్తే. అయినా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో చేశాం. రాజేంద్రప్రసాద్‌గారి నుంచి ఈ చిత్రంతో మరింత నేర్చుకున్నా. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, కృతిక, మౌర్యాని, హీరోలు నాని, సుధీర్‌బాబు, నవీన్ చంద్ర, వరుణ్ సందేశ్ తదితరులు పాల్గొన్నారు.