ఎప్పుడు రిలీజైనా హిట్టే!
‘‘నాకు ఈ ఏడాది వ్యక్తిగతంగా చాలా ఆనందాన్నీ, వృత్తిపరంగా కాస్త అసంతృప్తినీ అందించింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన హారర్–కామెడీ ‘ఇంట్లో దెయ్యం... నాకేం భయం’. నవంబర్ 13న రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా నోట్ల రద్దు ప్రభావంతో వాయిదా పడి, ఈ నెల 30న థియేటర్లలోకి వస్తోంది. ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు..
♦ నోట్ల రద్దు దెబ్బకు ఆగిన ఫస్ట్ మూవీ మాదే. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న ప్రజలు థియేటర్లకు రావడం కష్టమనే ఉద్దేశంతో విడుదల వాయిదా వేశాం. ఎప్పుడు రిలీజైనా హిట్టయ్యే చిత్రమిది.
♦ పెళ్లికి బ్యాండ్ వాయించే కుర్రాడు అనుకోకుండా మంత్రగాడిగా మారితే ఏం జరిగిందనేది చిత్రకథ. ఇందులో దెయ్యం ఎప్పుడూ ఒకరిలో ప్రవేశించదు. నోటికి వచ్చిన మంత్రాలు చదువుతూ... కాసేపు భయపడుతూ, అప్పుడప్పుడూ భయపెడుతూ ప్రేక్షకుల్ని నవ్వించే పాత్ర చేశా.
♦ నిర్మాత ప్రసాద్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. భారీ సినిమాలు తీసే ఆయన, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఎక్కువమందికి పని దొరుకుతుంది. అందరికీ ధైర్యం వస్తుంది. జి. నాగేశ్వరరెడ్డితో మూడో చిత్రమిది. ఎలాంటి సినిమా చేయాలని చాలారోజులు ఆలోచించి ఈ కథ ఓకే చేశాం.
♦ పెళ్లైన తర్వాత బాధ్యత తెలుస్తుంది అంటుంటారు. కానీ, నన్ను అడిగితే.. పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యతలు తెలుస్తాయి. ఈ ఏడాది పాప పుట్టిన తర్వాత లైఫ్‌లో సంతోషం ఎక్కువైంది. అలాగే, ప్రతి ఏడాదీ నాలుగైదు సినిమాలు చేసే నేను ఈ ఏడాది ‘సెల్ఫీ రాజా’, ఇప్పుడీ సినిమా చేశానంతే. అది కొంచెం అసంతృప్తిగా ఉంది.
♦ ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్‌కృష్ణ దర్శకత్వంలో నటించనున్న ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా, కొత్త దర్శకుడు సతీశ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాను. 2020 నాటి వేసవిలో ఒక ప్రేమకథా చిత్రంతో నేను దర్శకుడిగా పరిచయమవడా నికి సిద్ధమవుతున్నా.