ఇనుగుర్తిని మండలం చేయాలి
∙రోడ్డుపైనే వంటావార్పు
కేసముద్రం : మండలంలోని ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామంలో గురువారం ఇనుగుర్తి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు తొర్రూరు, నెక్కొండ, కేసముద్రం వైపుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ క్రిష్ణారెడ్డి, ఎస్సై ఫణిధర్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు నిలిచిపోయిన వాహనాలను కోమటిపల్లి మీదుగా తొర్రూరు వైపుకు తరలించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం మీ డిమాండ్‌ను ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని సీఐ,ఎస్సైలు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్ దార్ల భాస్కర్, వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పంట భూములను పరిశ్రమలకు అప్పగించం
∙ఆందోళన వ్యక్తం చేసిన ఎలుకుర్తి రైతులు
ఎలుకుర్తి (ధర్మసాగర్) : పరిశ్రమల స్థాపనకు ఎట్టి పరిస్థితుల్లోను తమ పంట భూములను అప్పగించేది లేదని మండలంలోని ఎలుకుర్తి, నర్సింగరావుపల్లి గ్రామాల రైతులు గురువారం ఎలుకుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు సంతకాలు కూడా సేకరించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించాలని కోరుతూ రైతులు సర్పంచ్ గుండవరపు రాంచందర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు.