ఆక్రమణలకు ఆనం అండ
నెల్లూరు నగరం ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఆక్రమణదారులకు ఆనం సోదరుల అండే అర్హత అయింది. మరోవైపు ఆనం సోదరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆక్రమణలను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు కోట్లు కొల్లగొడుతున్నారు.
పర్యవసానంగా సింహపురిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఏదైనా పని కోసం నగరంలోనికి వెళ్లాలంటే ఎన్ని గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. జనాన్ని ఉద్దరించడానికే పుట్టామని గొప్పలు చెప్పే ఆనం సోదరులు నగరం ఆక్రమణల సంగతి పట్టించుకోక పోవడం విశేషం.
నిర్మాణ దశలో పార్కింగ్ ప్లేస్‌లు చూపించి యజమానులు ప్లాన్ అప్రూవల్ పొందుతున్నారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టి కార్పొరేషన్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి నిర్మాణ సమయంలో పార్కింగ్‌లకు ఎగనామం పెడుతున్నారు. ఉదాహరణకు గ్రౌండ్ప్లోర్ను పార్కింగ్‌కు చూపించి ఆ తర్వాత వాటిని షాపింగ్ మాల్స్‌గా మారుస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో సైతం గ్రౌండ్‌ప్లోర్‌లో రూములు నిర్మించి పార్కింగ్ లేకుం డా చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన కనకమహల్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ట్రంకురోడ్డు, పెద్దబజారు, బాలాజీనగర్ తది తర ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, మాల్స్, కల్యాణ మండపాల్లో 95 శాతం నిర్మాణాలకు పార్కింగులు లే వు. దీంతో ఇక్కడికి వచ్చే వారు వాహనాలను ప్రధానరోడ్లపై పెట్టాల్సి వస్తోంది. ఈ కారణంగా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో నగరం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. పర్యవసానంగా ప్రమాదాలు పెరుతుండటంతో పాటు తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు.
కార్పొరేషన్ అధికారుల అవినీతి పుణ్యమాని నగరం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంద కోట్లకు పైనే అవినీతి జరిగినట్టు తెలుప్తోంది. అవినీతి నిరోధకశాఖ దాడుల్లో ఇది బయటపడింది. గ తంలో నెల్లూరుకు వచ్చిన అప్పటి పురపాలక శాఖామంత్రి మహీధర్‌రెడ్డి సైతం టౌన్‌ప్లానిం గ్ అక్రమాలపై అధికారులను చీవాట్లు పెట్టిన విషయం విదితమే.
అక్రమ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, నెలరోజుల్లోపు అన్ని రెక్టిఫై చేసుకోవాలని మంత్రి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.
అయినా ఇవేవీ పట్టని ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు అందినకాడికి ముడుపులు దండుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి స్థానిక అధికారుల అక్రమాలకు అడ్డుకట్టవేసి నగరంలో అక్రమ నిర్మాణాలకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.అధికారిక లెక్కలప్రకారం కార్పొరేషన్లో 11 షాపింగ్‌మాల్స్, 233 కాంప్లెక్స్‌లు, 31 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో 95 శాతం వాటికి పార్కింగ్ స్థలాలు లేవు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కార్పొరేషన్ అధికారు లు కళ్లు మూసుకోవడంతో అక్రమ నిర్మాణాల కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఇంటి నిర్మాణాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, క ల్యాణమండపాలు అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టాలంటే కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి.
నిబంధనల మేరకు కచ్చితంగా పైవాటిని నిర్మించే సమయంలో పార్కింగ్ స్థలం కేటాయించడం తప్పనిసరి. ప్లాన్అప్రూవల్లోనే పార్కింగ్ స్థలాన్ని కచ్చితంగా చూపించాలి. అప్పుడే అధికారులు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది.
ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రయివేటు స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలలో కలిపేసుకుంటున్నారు. బాధితులు ఫి ర్యాదులు చేసినా పట్టించుకొనేవారులేరు. ఈ లెక్కన కార్పొరేషన్లో వందకోట్లకు పైనే అవి నీతి జరిగింది. ఈ విషయం ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో బయటపడినట్లు సమాచారం.
నగరంలోని మాగుంట లేఔట్లో 60 అడుగుల మేర ఉన్న విలువైన రోడ్డు స్థలాన్ని అధికార పార్టీ అండదండలున్న కొందరు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. డాక్యుమెంటరీ ప్రకారం 11.11 అంకణాల స్థలం ఉండగా 17.33 అంకణాల్లో నిర్మాణం చేపట్టారు. సెట్‌బ్యాక్ వదలక పోవడంతో పాటు రెండువైపులా ప్రభుత్వ, ప్రయివేటు స్థలాన్ని ఆక్రమించారు. అంతేకాక బిల్డర్ జీప్లస్ వన్‌కు దరఖాస్తు చేసి జీప్లస్ ఫోర్ ( 5 అంతస్తులు) నిర్మాణం చేపట్టారు. తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టాడంటూ బాధితుడు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి నెల్లూరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
తొలుత విచారించిన అధికారులు ఇది అక్రమ నిర్మాణమేనని, తాము అనుమతులు మంజూరు చేయలేదంటూ చేతులు దులుపుకున్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. అధికారులు సరిగ్గా స్పందించక పోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణంపై కోర్టు స్టే మంజూరు చేసింది. నిర్మాణాలను తొలగించిన తర్వాతే అనుమతులివ్వాలంటూ ఆదేశాలిచ్చింది.
ఏం జరిగిందో తెలియదు కాని అక్రమ నిర్మాణం ఆగలేదు. బిల్డర్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. బాధితులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.
భారీ ముడుపులతో అధికారులకు ఎర
భారీ ఎత్తున ముడుపులు ముట్టడంతోనే అధికారులు మిన్నకుండి పోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓప్రముఖ ఫ్యాన్సీషాప్స్ అధినేత కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. నిబంధనల మేరకు కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ప్లాన్‌లో గ్రౌండ్ ప్లోర్‌ను పార్కింగ్‌కు ఇస్తున్నట్టు చూపించాడు. అనుమతి వచ్చేసింది. అసలే ఆర్టీసీ కూడలి.. అంత విలువైన స్థలాన్ని పార్కింగ్‌కు వదిలితే ఏమొస్తుందని భావించి కార్పొరేషన్ అధికారుల చేతులు బలంగా తడిపాడు. పార్కింగ్ స్థలం మాయమైంది. దానిస్థానంలో షాపింగ్ మాల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు వాహనాలన్నీ రోడ్లపైనే.
ఒక్క షాపింగ్ మాల్సేకాదు నగరంలో ప్రధాన కూడళ్లలోని కల్యాణమండపాలు, అపార్ట్మెంట్లు,షాపింగ్‌కాంప్లెక్స్‌లు... వేటికీ పార్కింగ్ స్థలాలు లేవు. నెల్లూరు కార్పొరేషన్ అక్రమ కట్టడాలు,నోపార్కింగ్లకు నిలయంగా మారింది. దీంతో వాహనాలన్నీ రోడ్లపైనే. పర్యవసానంగా నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఆనం సోదరులు మాత్రం పట్టించు కోలేదు.