డ్రగ్స్ కేసులో దర్యాప్తు బాధ్యత ఎవరిది?
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు చేసే బాధ్యత ఎవరిదో.. దర్యాప్తు బాధ్యతలను అప్పగించే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటో తమకు తెలియజేయాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, సీబీఐ, ఈడీల వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో విచారణ కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... దేశం వెలుపల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అయితే సిట్ ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని చెప్పారు. కేవలం డ్రగ్స్ కేసుల్లోనే దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థలున్నాయన్నారు.