పెట్టుబడిదారీ విధానాలను ఎండగట్టాలి
► సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
► హుజూర్‌నగర్‌లో పార్టీ జిల్లా శిక్షణ తరగతులు ప్రారంభం
హుజూర్నగర్ : కేంద్రం, రాష్ట్ర పాలకులు అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానాలను ప్రజలకు వివరించి గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న అవినీతి తదితర అంశాలపై ప్రసంగించారు. భవిష్యత్‌లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు, ఇతర అంశాలపై నాయకులకు వివరించారు.
శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాభాస్కర్, జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు ఈ శిక్షణ తరగతులలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, డి.రవినాయక్, మల్లు లక్ష్మి, మల్లునాగార్జునరెడ్డి, పారేపల్లిశేఖర్రావు, కొదమగుండ్ల నగేష్, ములకలపల్లి సీతయ్య, పల్లె వెంకటరెడ్డి, శీతల రోషపతి, దుగ్గి బ్రహ్మం, నాగారపుపాండు, వట్టెపుసైదులు, షేక్‌యాకూబ్, భూక్యాపాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలు
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని జూలకంటి రంగారెడ్డి అన్నారు. శిక్షణ తరగతుల అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ సామాజిక వేదిక పేరుతో వామపక్ష పార్టీలతో పాటు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాన్ని రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా జూలై 4న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పారేపల్లి శేఖర్‌రావు, వెంకటరెడ్డి, శీతల రోషపతి, వెంకటరెడ్డి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.