మరో రెండు చార్జిషీట్లు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ టెక్ అంశాలపై సీబీఐ అభియోగ పత్రాలు
నిందితుల జాబితాలో మంత్రి గీతారెడ్డి, మాజీలు ధర్మాన, సబిత
ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, శామ్యూల్, శ్యాంబాబ్, రత్నప్రభ, మురళీధర్‌రెడ్డి
ఐఏఎస్‌ల విచారణకు ప్రభుత్వ అనుమతి కోరాం: సీబీఐ ఎస్పీ
ఇప్పటివరకు 10 చార్జిషీట్లు దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ మంగళవారం మరో రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ ప్రాజెక్ట్‌కు చెందిన ఇందూ టెక్‌జోన్ సంబంధిత అంశాలపై ప్రత్యేక కోర్టులో వేర్వేరుగా ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు మొత్తం 10 చార్జిషీట్లు దాఖలు చేసినట్టయ్యింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించి 10 మంది వ్యక్తుల్ని, సంస్థలను నిందితులుగా చేర్చింది. అలాగే ఇందూ టెక్కు సంబంధించి 14 మంది వ్యక్తులు, కంపెనీలను నిందితులుగా పేర్కొంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన వ్యవహారంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి, ఈ విభాగం అప్పటి ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబ్లను నిందితులుగా చేర్చారు.
అలాగే రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ఆ విభాగం ముఖ్య కార్యదర్శి శామ్యూల్, ఏపీఐఐసీ ఎండీగా పనిచేసిన బీపీ ఆచార్య, ఈడీగా విధులు నిర్వహించిన మురళీధర్‌రెడ్డిలను నిందితులుగా చేర్చారు. ఇందూ ప్రాజెక్టుకు సంబంధించిన చార్జిషీట్లో అప్పటి ఐటీ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇందూ సంస్థల చైర్మన్ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇతరుల పేర్లను చేర్చారు. ఐదు భారీ ట్రంకు పెట్టెల్లో తెచ్చిన చార్జిషీట్లు, అనుబంధ పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ ఎస్పీ చంద్రశేఖరన్ సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు అందజేశారు.
ఈ రెండు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి (సాంక్షన్) కోరుతూ లేఖలు రాశామని, ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని చంద్రశేఖరన్ వివరించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) కింద నమోదు చేసిన అభియోగాలను విచారణకు స్వీకరించేందుకు (ప్రాసిక్యూషన్‌కు) ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, చౌతాలా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరిపై ఈ అభియోగాలను విచారణకు స్వీకరించవచ్చని తెలిపారు. వారం క్రితం పెన్నా, ఇండియా, రఘురామ్ సిమెంట్స్ పెట్టుబడులపై సమర్పించిన చార్జిషీట్లకు సంబంధించిన అనుబంధ పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలతో కూడిన మూడు ట్రంకు పెట్టెలను కూడా కోర్టుకు సమర్పించారు.
పలు సెక్షన్ల కింద అభియోగాలు
తాజా రెండు చార్జిషీట్లలో ఏమేం పేర్కొన్నదీ సంక్షిప్తంగా తెలియజేస్తూ సీబీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్లో కంపెనీల పేర్లు గానీ, వ్యక్తుల పేర్లు గానీ పేర్కొనకుండా... వారి హోదాలు మాత్రమే పేర్కొన్నారు. అయితే సీబీఐ ఎస్పీ చంద్రశేఖరన్ నిందితుల వివరాలను న్యాయమూర్తికి తెలియజేయడంతో ఆ వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. ఐపీసీ 120(బి) రెడ్‌విత్ 409, 420, 468, 471, 477(ఎ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 9, 11, 12, 13 (2) రెడ్‌విత్ 13(1)(సి)(డి)ల ప్రకారం అభియోగాలు మోపారు. ఇందూ ప్రాజెక్ట్‌కు శంషాబాద్‌లో 250 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆ సంస్థ బెంగళూరుకు చెందిన ఓ సంస్థలో రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. అలాగే లేపాక్షి నాలెడ్జి హబ్‌కు అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రయోజనాలు పొందినందుకు ప్రతిగా జగన్మోహన్రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లో ఆ సంస్థ రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది.
ప్రజలు గమనించాలి: సీబీఐ
సీబీఐ తన ప్రకటనలో చివరన ఒక అంశాన్ని పొందుపరిచింది. ఈ వివరాలన్నిటికీ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలే ఆధారమని ప్రజలు గమనించాలని కోరింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో వారు నేరం చేశారో లేదో తేలేదాకా నిందితులు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అని పేర్కొంది.
ఇందూ టెక్‌లో నిందితులు...
1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి విజయసాయిరెడ్డి, 3. శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇందూ సంస్థల చైర్మన్), 4. ఇందూ ప్రాజెక్ట్స్, 5. ఇందూ టెక్‌జోన్, 6. ఎస్పీఆర్ ప్రాజెక్ట్స్, 7. రత్నప్రభ (అప్పటి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి), 8. సబితా ఇంద్రారెడ్డి (అప్పటి ఐటీ శాఖ మంత్రి), 9. బీపీ ఆచార్య (సీనియర్ ఐఏఎస్), 10. పార్థసారధి (ఏపీఐఐసీ అప్పటి సీఈ)
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో నిందితులు...
1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి విజయసాయిరెడ్డి, 3. శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇందూ సంస్థల చైర్మన్), 4. ఇందూ ప్రాజెక్ట్స్, 5. లేపాక్షి నాలెడ్జ్ హబ్, 6. శ్రీనివాస్ బాలాజీ (సీఈవో, లేపాక్షి నాలెడ్జ్ హబ్), 7. బీపీ ఆచార్య (సీనియర్ ఐఏఎస్), 8. బి. శ్యాంబాబ్ (అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి), 9. జె.గీతారెడ్డి (పరిశ్రమల శాఖ మంత్రి), 10. ఎం.శామ్యూల్ (సీనియర్ ఐఏఎస్), 11. ధర్మాన ప్రసాదరావు (అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి), 12. మురళీధర్‌రెడ్డి (ఐఏఎస్ అధికారి), 13. కుమార్‌బాబు ప్రభాకర్ (బెంగళూరుకు చెందిన ప్రైవేటు వ్యక్తి), 14. జగతి పబ్లికేషన్స్