IOP
-
మళ్లీ ఐపీవోల హల్చల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇటీవల దేశీయంగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. ఇటీవలే నిధుల సమీకరణ చేపట్టిన హర్ష ఇంజినీర్స్ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో లిస్ట్‌కాగా.. ప్రభుత్వ రంగ కంపెనీ వ్యాప్కోస్ ఐపీవో బాట పట్టింది. మరోవైపు ఫ్లోట్ గ్యాస్ తయారీ కంపెనీ గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ యూనిపార్ట్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూలకు తాజాగా సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం.. గోల్డ్ ప్లస్ గ్లాస్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఐపీవోలో భాగంగా ఫ్లోట్ గ్లాస్ తయారీ కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.28 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫ్లోట్ గ్లాస్ తయారీలో కంపెనీ దేశీయంగా 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆటోమోటివ్, నిర్మాణం, పారిశ్రామిక రంగాలలో ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు వినియోగమవుతున్నాయి. యూనిపార్ట్స్ ఇండియా ఐపీవోకు వీలుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన యూనిపార్ట్స్ ఇండియాకు సెబీ ఓకే చెప్పింది. దీంతో ఇష్యూలో భాగంగా 1.57 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. 2014 సెప్టెంబర్‌లో ఒకసారి, 2018 డిసెంబర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ రెండుసార్లూ సెబీ నుంచి అనుమతులు సైతం పొందింది. అయితే పరిస్థితులు అనుకూలించక వెనకడుగు వేసింది. కంపెనీ ప్రధానంగా ఆఫ్‌హైవే మార్కెట్‌కు అనుగుణమైన సిస్టమ్స్, విడిభాగాలను సరఫరా చేస్తోంది. వ్యవసాయం, కన్స్ట్రక్షన్, మైనింగ్ తదితర రంగాలకు సొల్యూషన్లు, ప్రొడక్టులు అందిస్తోంది. ఐపీవోకు వ్యాప్కోస్ నీటిపారుదల, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసులందించే పీఎస్‌యూ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 3.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్(కేంద్ర ప్రభుత్వం) విక్రయానికి ఉంచనుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కంపెనీ దక్షిణాసియా, ఆఫ్రికాలోనూ డ్యాములు, రిజర్వాయర్లకు సంబంధించిన ఇంజినీరింగ్, ఇరిగేషన్, వరద నియంత్రణ సర్వీసులను అందిస్తోంది. 30 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 455కుపైగా ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది(2021–22) ఆదాయం 11 శాతం బలపడి రూ. 2,798 కోట్లకు చేరగా.. నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 69 కోట్లను అధిగమించింది. కంపెనీ పనిచేస్తున్న విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఇతర సంస్థలలో ఇప్పటికే లిస్టయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీ సీసీ, వా టెక్ వాబాగ్‌లను ప్రస్తావించవచ్చు. -
ఐవోసీ లాభం 50 శాతం అప్
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ సంస్థ ఐవోసీ జూన్ త్రైమాసికంలో 50 శాతం అధికంగా లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.6,831 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,549 కోట్లుగా ఉంది. ఇన్వెంటరీ లాభాలు (దిగుమతి చేసుకున్న ముడి చమురు, విక్రయానికి వచ్చే సరికి రేట్ల పెరుగుదలతో కలిగే ప్రయోజనం) రూ.7,866 కోట్లుగా ఉండడమే ఈ స్థాయి పనితీరుకు దోహదపడింది. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండడం, కరెన్సీ మారకం నష్టాలు ఉన్నప్పటికీ ఇన్వెంటరీ లాభాల కారణంగా ఐవోసీ అధిక లాభాలను నమోదు చేసింది. ఆదాయం రూ.1,49,747 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,28,183 కోట్లు కావడం గమనార్హం. ప్రతీ బ్యారెల్ ముడి చమురును, ఇంధనంగా మార్చినందుకు 10.21 డాలర్లను ఆర్జించింది. ఇన్వెంటరీ లాభాలను తీసేసి చూస్తే ప్రతీ బ్యారెల్‌పై రిఫైనింగ్ మార్జిన్ 5.18 డాలర్లుగా ఉండగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.44 డాలర్లు కావడం గమనార్హం. -
నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ
- ప్రైస్‌బాండ్ రూ.245-250 రేంజ్లో న్యూఢిల్లీ: నారాయణ హృదయాలయ ఐపీఓ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ నెల 21న (వచ్చే సోమవారం) ముగిసే ఈ ఐపీఓకు రూ. 245-250 ధరల శ్రేణిని ప్రైస్‌బాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా 14 శాతం వాటాకు సమానమైన 2.45 కోట్ల షేర్లను జారీ చేస్తారు. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు సమీకరించామని తెలిపింది. -
గట్టెక్కిన ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్
- ఖజానాకు రూ. 9,379 కోట్లు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ.. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డిజిన్వెస్ట్‌మెంట్ గట్టెక్కగలిగింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువయిన తరుణంలో బీమా దిగ్గజం ఎల్ఐసీ తదితర సంస్థాగత ఇన్వెస్టర్లు రంగంలోకి దిగి తోడ్పాటు అందించాయి. దీంతో ఐవోసీలో 10 శాతం వాటాల విక్రయంతో ఖజానాకు సుమారు రూ. 9,379 కోట్లు జమకానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో 24.28 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా 28.74 కోట్ల షేర్లకు (దాదాపు 1.18 రెట్లు) బిడ్లు దాఖలయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 11,107 కోట్లు ఉంటుంది. 5 శాతం డిస్కౌంటు ఇచ్చినప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం అయిదో వంతు షేర్లే కొనుగోలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం తమ కోటాకి సంబంధించి 1.43 రెట్లు ఎక్కువ షేర్లకు బిడ్లు వేసారు. 19.42 కోట్ల షేర్లను వారికి ఉద్దేశించగా.. 27.85 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. మార్కెట్ల పతనానికి అనుగుణంగా ఐవోసీ షేరు ఓఎఫ్ఎస్ కనీస ధర రూ. 387 కన్నా తక్కువకి పడిపోయి బీఎస్ఈలో రూ. 378.25 వద్ద క్లోజయ్యింది.