‘ఐఓఆర్ఏపై భారత్ చిత్తశుద్ధితో ఉంది’
సింగపూర్: హిందూ సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల ఆర్థిక ప్రగతి, తీరప్రాంత భద్రత కోసం ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేసన్ (ఐఓఆర్ఏ) ఏర్పాటుకు భారత్ చిత్తశుద్ధితో ఉందని విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ ప్రకటించారు. సింగపూర్లో శుక్రవారం ప్రారంభమైన హిందూ మహాసముద్ర సదస్సులో ఆయన ప్రసంగిస్తూ తీరప్రాంత దేశాలకు మరింత సహకారం అందిస్తామని చెప్పారు.
హిందూ మహాసముద్రం వెంట ఉన్న దేశాల మధ్య ఉన్న సోదరభావంతో బంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. తీరప్రాంత వసతులను మెరుగుపర్చడం ద్వారా సభ్య దేశాల మధ్య రవాణా సదుపాయాలను పెంచాలని జైశంకర్ అన్నారు. ఈ సదస్సుకు 21 సభ్య దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు.