వారంలో ‘ఉరి’పై నివేదిక
న్యూఢిల్లీ: మరణ శిక్షను కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అనే విషయంపై రూపొందించిన సమగ్ర నివేదికను లా కమిషన్ వచ్చేవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ శిక్ష భవితవ్యంపై అందులో సిఫార్సు చేయనుంది. నివేదిక ప్రతిని కేంద్ర న్యాయ శాఖకూ అందించనుంది. ముంబై దాడుల దోషి యాకూబ్ మెమన్ను ఉరితీయడంతో మరణశిక్షపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత న్యాయ కమిషన్ కాలపరిమితి ఈ నెల 31తో ముగియనుంది.
అందువల్ల ఆ లోపే నివేదికను సుప్రీంకోర్టుకు అందించాలని కమిషన్ కృషి చేస్తోంది. సంతోశ్ కుమార్, సతీశ్ భూషణ్ బరియార్ వర్సెస్ మహారాష్ట్ర, శంకర్ కిషన్‌రావు ఖాడే వర్సెస్ మహారాష్ట్ర కేసుల విచారణ సందర్భంగా మరణ శిక్షపై దేశవ్యాప్తంగా లోతైన చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో విస్తృత సంప్రదింపులు జరిపి సమగ్ర నివేదిక రూపొందించాలంటూ లా కమిషన్‌ను ఆదేశించింది.
దాంతో కమిషన్ ఉరిశిక్ష విధింపుపై అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, డీఎంకే ఎంపీ కనిమొళి, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షను రద్దు చేయాలని అభిప్రాయపడగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన దుష్యంత్ దవే తదితరులు ఉరిశిక్ష అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎక్కువమంది ఉరిశిక్షను రద్దు చేయాలనే అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం.
నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడమే భారతీయ శిక్షాస్మృతి ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. అత్యంత హేయమైన నేరాల్లో మరణ శిక్షను విధించడం అమానవీయం, పాశవికం కాబోదని, అది జీవించే హక్కును ఉల్లంఘించడం కాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో.. లా కమిషన్ ఎలాంటి సిఫారసులు చేయబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేయడం లాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని, సాధారణ నేరస్తులే కాకుండా, ఉగ్రవాద సంస్థలు సైతం ఈ నేరాలకు పాల్పడుతున్నాయని, అందువల్ల, వారికి ఐపీసీ 364ఏ కింద మరణ శిక్ష విధించడం సబబేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.