చెన్నై, రాజస్తాన్ రెండేళ్లు అవుట్
వాటి స్థానంలో రెండు కొత్త ఐపీఎల్ జట్లకు అవకాశం
టైటిల్ స్పాన్సరర్‌గా వీవో మొబైల్స్
నవంబర్ 9న ఏజీఎం
బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు
ముంబై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంతో మసకబారిన ప్రతిష్టను పెంచుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం బిగించింది. రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను పూర్తిగా రద్దు చేయకుండా... వాటి స్థానంలో మరో రెండు కొత్త జట్లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈమేరకు వచ్చే రెండు సీజన్ల కోసం రెండు కొత్త జట్లను ఎంపిక చేసేందుకు బిడ్స్‌ను ఆహ్వానించనుంది. దీంతో ఐపీఎల్‌ను ఎనిమిది జట్లతోనే జరుపుతామని బోర్డు స్పష్టం చేసినట్టయ్యింది. బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అధ్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని సభ్యులు భావించారు. దీంతో 2016, 2017 సీజన్లకు చెన్నై, రాజస్తాన్ జట్లు దూరంగా ఉంటాయి. వీటి స్థానాలను మరో రెండు కొత్త జట్లు భర్తీ చేస్తాయి. అందరూ ఊహించినట్టుగానే ఈ మాజీ చాంపియన్లను రద్దు చేసేందుకు మెజారిటీ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో రెండేళ్ల అనంతరం... అంటే 2018 సీజన్ నుంచి ఇవి తిరిగి బరిలో ఉంటాయి.
అయితే కొత్తగా చేరిన రెండు జట్లకు తోడు చెన్నై, రాజస్తాన్‌లను కలిపి 2018 సీజన్‌ను పది జట్లతో ఆడిస్తారా.. లేదా అనే విషయంలో బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ‘ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నాలుగు ప్రతిపాదనల్లో ఒక్కదానికి మాత్రమే కమిటీ ఆమోదం తెలిపింది. ఖాళీ అయిన రెండు జట్ల స్థానంలో రెండేళ్ల కోసం బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తాం. ఆ తర్వాతే ఐపీఎల్‌ను 10 జట్లతో కొనసాగించాలా? లేక 8 జట్లతోనే ఉంచాలా అని నిర్ణయిస్తాం’ అని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి రెండేళ్లు ముందుగానే వైదొలిగిన పెప్సీకో స్థానంలో చైనాకు చెందిన వీవో మొబైల్ కంపెనీ హక్కులు దక్కించుకుంది.బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నవంబర్ 9న జరుగుతుంది.