పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారుల సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు.
పరీక్షల నిర్వహణలో జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత ్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దన్నారు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రకాష్‌కుమార్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్‌లు, డిపార్టుమెంటల్ అధికారులు ఆదేశించారు.
తప్పు చేస్తే సస్పెన్షన్..
పదో తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో తప్పు చేస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు బల్లల మీద కూర్చొని పరీక్షలు రాసేలా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, అత్యవసర మందులతో వైద్య సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు.
అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలన్నారు. విద్యార్థులను ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. 26వ తేదీన ఇన్విజిలేటర్లుతో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలివ్వాలన్నారు. చీఫ్‌లు, డిపార్టుమెంట్ అధికారులు ప్రతిరోజు ప్రశ్నపత్రాలను బయటకు తీసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆరోజు తేదీ ఏ సబ్జెక్టు, ఏ పేపర్ అన్ని విషయాలను గమనించి ప్రశ్నపత్రాలను బయటకు తీయాలన్నారు.
యాక్టు 25 అమలు..
పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆదేశాల మేరకు యాక్టు 25 అమలు చేస్తున్నట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ చట్టం కింద పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా రూ.500 నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అవసరమైతే 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జరిగిన పొరపాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధిస్తారు. పరీక్షల హాలులో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే ఆ విద్యార్థిని డీబార్ చేయడంతో పాటు అక్కడి ఇన్విజిలేటర్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని డీఈఓ కోరారు.
14 సిట్టింగ్ స్క్వాడ్లు
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 39,601 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు, మొత్తం 195 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 173 కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థులకు, 22 కేంద్రాలు ప్రైవేట్ విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 14 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు డీఈఓ చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాలన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ కేంద్రాలన్నింటి కీ ప్రత్యేకంగా 14 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, 31 మంది సీ సెంటర్ కస్టోడియన్లు ఆయా పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 48 మంది స్క్రైబ్‌లను ఏర్పాటు చేసినట్లు రాజేశ్వరరావు చెప్పారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీఈఓ కోరారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బి.విజయభాస్కర్, ఇ.సాల్మన్, కొల్లా వెంకట్రావు, కాశీశ్వరరావు, షేక్ చాంద్‌బేగమ్, వి. రామ్మోహనరావు, అసిస్టెంట్ కమిషనర్ సి.నాగప్ప, చీఫ్‌లు, డీఓలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరుకాని చీఫ్‌లు, డీఈఓలకు మెమోలు జారీ చేయాలని డీఈఓ ఆదేశించారు.