పరిస్థితిని బట్టి రాష్ట్రానికి కేంద్ర ఐపీఎస్‌లు.!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పరిస్థితిని బట్టి రాష్ట్రానికి రావాలనే యోచనలో కేంద్ర డెప్యుటేషన్‌లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులున్నారు. ఈ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు 144 మంది, తెలంగాణకు 112 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర కేడర్‌కు చెందిన 25 మందికి పైగా ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ డెప్యుటేషన్తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొంద రు ఐపీఎస్‌లు దాదాపు పదేళ్లకు పైగా కేంద్ర డెప్యుటేషన్‌లో ఉన్నారు. వెంటనే రాష్ట్రానికి వెళ్లాలా లేక కొంత కాలం డెప్యుటేషన్‌ను పొడిగించుకుని కొనసాగాలా అనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలిసింది. గడువు పూర్తయ్యాక తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినా, లేక ఇరు ప్రభుత్వాల నుంచి తమకు సరైన పోస్టింగ్ కల్పిస్తూ పిలుపు వచ్చినా తాము వెళ్లక తప్పదని కొందరు ఐపీఎస్ అధికారులు పేర్కొన్నారు.