ఐరావతంపై ఊరేగిన లక్ష్మీనారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు నృసింహుని దర్శనం కోసం తరలివచ్చారు. హిరణ్యకస్యపుడిని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలని కోరతారు. దీంతో స్వామి వారు అనుగ్రహించి వారి కోరిక మేరకు ఐరావతంపై దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పార్థసార«థి ఆచార్యులు, నరసింహాచార్యులు వివరించారు. ఆలయ ప్రాంగణంతో పాటు ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శనివారం బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు ఒకరోజు ముందే భక్తులు పట్టణం చేరుకున్నారు.
ఆలయ అర్చకులు, పండితులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశం గావించిన తర్వాత రథంపై ప్రతిష్టించారు. శ్రీవారికి నిత్య కైంకర్య సేవలు నిర్వహించిన పిదప బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్యాహవచనం, వాస్తుహోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ గావించారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం తిరిగి ఆలయ ప్రవేశం గావించారు. పూజలనంతరం తెల్లవారుజామున స్వామి వారు రథంపైకి ప్రవేశిస్తారు. ఐరావత ఉత్సవం ఉభయదారులుగా నర్సేపల్లి మురళీధర్, వనజ కుమారి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.