iron and steel
-
వేదాంతా ఐరన్, స్టీల్ బిజినెస్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది. గత నెల 29న ప్రకటించిన బిజినెస్‌ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే. తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్ బిజినెస్ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్ మెటల్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
లోహాల ఉత్పత్తిలోనూ ‘ఆత్మనిర్భరత’ కావాలి
సాక్షి, హైదరాబాద్: ఇనుము, ఉక్కు వంటి లోహాల ఉత్పత్తిలోనూ మన దేశం ‘ఆత్మనిర్భరత’సాధించేందుకు శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే పిలుపునిచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు భారత్‌లో ఉన్నారని, సామర్థ్యానికి తగ్గట్టుగా కృషి చేస్తే అసాధ్యం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వార్షిక సాంకేతిక సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిభకు కొరతేమీ లేదని, కావాల్సిందల్లా కొద్దిపాటి ప్రోత్సాహం మాత్రమేనని అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఈ విషయం రుజువైందని, రికార్డు సమయంలో టీకాలు తయారు చేయడమే కాకుండా.. వాటిని అందరికీ అందించడం ద్వారా లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ మార్పు కనిపిస్తోందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్ బి.జె.రావు మాట్లాడుతూ లోహశాస్త్రంలో అద్భుతాలు సృష్టించేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నా యని, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నా లజీల సాయంతో మునుపెన్నడూ ఎరుగని లక్షణాలున్న లోహా లను తయారు చేసి వాడుకోవ చ్చునని వివరించారు. శాస్త్రవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని, వెయ్యిమందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం హైదరాబాద్ చైర్మెన్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, డీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి, ఐఐఎం అధ్యక్షుడు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్‌లు పాల్గొన్నారు. -
దిగొస్తున్న సిమెంట్ ధరలు..
సాక్షి, అమరావతి : చాన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న సిమెంట్, ఐరన్ ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. మధ్యతరగతి, నిర్మాణ రంగాల వారికి ఊరటనిచ్చేలా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇవి పెరగడమే తప్పా తగ్గడం లేదు. దీంతో సొంతంగా ఇళ్లు, భవనాల నిర్మాణం చేపట్టే వారితో పాటు నిర్మాణరంగంలో ఉన్న వారికి వీటి ధరలు పెనుభారంగా పరిణమించాయి. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతూ వచ్చింది. విజయవాడలో దాదాపు ఐదారు నెలల నుంచి 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.350–380ల మధ్య ఉంది. ఇప్పుడది రూ.80 నుంచి 100 వరకు తగ్గింది. బెజవాడ మార్కెట్లో 20కి పైగా కంపెనీలు సిమెంట్ విక్రయాలు జరుపుతున్నాయి. ఒక్కో కంపెనీ మధ్య సిమెంట్ గ్రేడ్‌ను బట్టి బస్తాకు 20–80 వరకు వ్యత్యాసం ఉంటుంది. వారం పది రోజుల నుంచి సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం వరకు కూడా 50 కిలోల బస్తా ధర రూ.350– 370 మధ్య ఉన్న సిమెంట్ ఇప్పుడు రూ.260–280కు దిగివచ్చింది. అదే సమయంలో ఇనుము «(ఐరన్) ధర కూడా బాగా తగ్గుముఖం పట్టింది. జాతీయ స్థాయిలో ఆర్థికమాంద్యం ప్రభావంతో టన్ను ఇనుము ధర రూ.10 నుంచి 12 వేల వరకు తగ్గింది. రెండు మూడు నెలల క్రితం ఐరన్ టన్ను రూ.50–52 వేల వరకు ఉండేది. కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చి ఇప్పుడు సగటున రూ.38–40 వేల మధ్య లభ్యమవుతోంది. సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా దిగివస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉన్న వర్తకులు సాధ్యమైనంత మేర నిల్వ ఉంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత నిర్మాణరంగం మరింత ఊపందుకుంటే లాభపడవచ్చని వీరు యోచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకు సగటున ఐరన్ 10 నుంచి 15 మిలియన్ టన్నులు, సిమెంట్ 15–20 మిలియన్ టన్నుల వినియోగం జరుగుతోంది. ఇటుక ధరలూ సరళం.. మరోవైపు సిమెంట్, ఇనుము ధరలతో పాటు ఇటుక ధరలు కూడా దిగివస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి ఇటుకలు రూ.7 వేలకు విక్రయించే వారు. ఇప్పుడు రూ.5000–5,500కు లభ్యమవుతున్నాయి. ఈ లెక్కన వెయ్యి ఇటుకల వద్ద రూ.1,500–2000 వరకు తగ్గుముఖం పట్టినట్టయింది. త్వరలో ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇలా నిర్మాణ రంగానికి అవసరమైన వీటి ధరలు ఒక్కొక్కటిగా తగ్గుతుండడం నిర్మాణ రంగం వారికి ఊరటనిస్తోంది. ప్రభుత్వం కొత్త విధానం ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తే నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుందని ‘క్రెడాయ్’ విజయవాడ చాంబర్ అధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
దూకుడు పెంచిన జీఎస్టీ అధికారులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ జీఎస్టీ అధికారులు దూకుడు పెంచారు. షెల్ కంపెనీల ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారుల పని పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఓ ఐరన్ అండ్ స్టీల్ వ్యాపార సంస్థ యజమాని ఇంటితో పాటు కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో శంకరంపేట, నాచారం యూనిట్లలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. మూడు డొల్ల కంపెనీల ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల మేర ఇన్‌వాయిసెస్‌లు జారీ చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ ఇన్‌వాయిసెస్‌ల వల్ల ప్రభుత్వానికి రూ. 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు అధికారులు. ప్రస్తుతం సదరు సంస్థ యజమానిని అరెస్ట్ చేయడమే కాక రూ. 3 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా మిగతా కోటి రూపాయలు చెల్లించే విధంగా యజమాని నుంచి పూచీకత్తు తీసుకున్నారు. ఇవే కాక ఇతర అనేక రంగాలలో పన్ను ఎగవేతదారుపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు. -
ఈ ఏడాది 10% అధికంగా ఉత్పత్తి: వైజాగ్ స్టీల్
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్ 10 రోజులపాటు ఉత్పత్తికి అంతరాయాన్ని కల్పించినప్పటికీ ఈ ఏడాది 10% వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వ్యక్తం చేసింది. వెరసి గత ఆర్థిక సంవత్సరం(2013-14)తో పోలిస్తే 10% అధికంగా 3.5 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగలమని అంచనా వేసింది. హుద్‌హుద్ కారణంగా అక్టోబర్ 12 నుంచి పది రోజులపాటు ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నదని కంపెనీ చైర్మన్ పి.మధుసూదన్ చెప్పారు. గతేడాది కంపెనీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టిస్తూ 3.2 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసిన విషయం విదితమే. తుపాన్ ప్రభావం తరువాత కంపెనీ దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలను మొదలుపెట్టింది. కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) 1.86 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే కాలంలో 1.77 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది.