రక్షణ ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఫగ్గన్‌సింగ్ కులస్తే
సాక్షి, హైదరాబాద్: ఇనుము, ఉక్కు వంటి లోహాల ఉత్పత్తిలోనూ మన దేశం ‘ఆత్మనిర్భరత’సాధించేందుకు శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే పిలుపునిచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు భారత్‌లో ఉన్నారని, సామర్థ్యానికి తగ్గట్టుగా కృషి చేస్తే అసాధ్యం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వార్షిక సాంకేతిక సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిభకు కొరతేమీ లేదని, కావాల్సిందల్లా కొద్దిపాటి ప్రోత్సాహం మాత్రమేనని అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఈ విషయం రుజువైందని, రికార్డు సమయంలో టీకాలు తయారు చేయడమే కాకుండా.. వాటిని అందరికీ అందించడం ద్వారా లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ మార్పు కనిపిస్తోందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్ బి.జె.రావు మాట్లాడుతూ లోహశాస్త్రంలో అద్భుతాలు సృష్టించేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నా యని, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నా లజీల సాయంతో మునుపెన్నడూ ఎరుగని లక్షణాలున్న లోహా లను తయారు చేసి వాడుకోవ చ్చునని వివరించారు.
శాస్త్రవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని, వెయ్యిమందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం హైదరాబాద్ చైర్మెన్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, డీఎమ్‌ఆర్‌ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి, ఐఐఎం అధ్యక్షుడు, డీఆర్‌డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment