'సాగునీరిస్తే టీఆర్ఎస్ ప్రచారకర్తగా ఉంటా'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సాగునీటిని అందిస్తే టీఆర్ఎస్కు ప్రచారకర్తగా ఉంటానంటూ చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటి అవసరం చాలా ఉందన్నారు. ఈ జిల్లాలకు మూడేళ్లలో సాగునీటిని అందిస్తే తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి, టీఆర్ఎస్కు ప్రచారకర్తగా ఉండిపోతానని స్పష్టం చేశారు. వరంగల్‌లో ఓటమి తీర్పు ప్రజలేదనన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకుంటామన్నారు. ప్రతిపక్షాలకు అసహనం ఉంటే టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నష్టంలేదని జానా అన్నారు. ప్రజల్లో అసహనం, అసంతృప్తి రాకుండా చూసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని, అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మి వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించారని చెప్పారు.
రాజకీయాల్లో పొత్తులు సహజమేనన్నారు. 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఆ ఎన్నికల్లో ఎవరు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఇప్పుడు అప్రస్తుతం, అసందర్భం అని జానా స్పష్టం చేశారు. ఈ ఓటమితో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. ఒకసారి గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే కృంగిపోవడం వంటివి చేయకూడదన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజమన్నారు. ఓడిపోవడానికి కారణాలు ఏమిటి, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఏం చేయాలనేదానిపై లోతుగా విశ్లేషించుకుందామని జానారెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్య విలువలకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ప్రజల విశ్వాసం పొందడానికి నిరంతరం పోరాటం చేయాలని, ప్రజల పక్షాన ఆలోచన చేయాలని పార్టీ శ్రేణులకు జానా సూచించారు.