చెరవుల సర్వే!
- అక్రమార్కుల జాబితా సమర్పించాలని హైకోర్టు ఆదేశం
- చెరువులకు హద్దులు నిర్ణయించాలని సూచన
- సమగ్ర సర్వేకు యంత్రాంగం కసరత్తు
-సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :చెరువుల సర్వేకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని చెరువులు, కుంటల స్థితిగతులను సంయుక్తంగా అధ్యయనం చేస్తున్న ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలు ఇప్పటికే సర్వే చేస్తుండగా.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను కూడా సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కాప్రా చెరువు కబ్జాకు గురవుతుందనే దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ అంశాన్ని కేవలం కాప్రాకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల స్థితిగతులపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగుతున్న ప్రభుత్వం.. చెరువుల ఆక్రమణల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. హెచ్ఎండీఏ పరిధిలో 2,857 చెరువులుండగా, వీటిలో 318 చెరువులు శివార్లలోని 14 మండలాల్లో ఉన్నాయి. ఈ ట్యాంకులకు ఎఫ్టీఎల్ నిర్ధారణ, ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం మ్యాపింగ్ చేస్తోంది. ఈ అంశంపై లోకాయుక్త ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో గత ఆరు నెలలుగా నీటిపారుదల, హెచ్ఎండీఏ యంత్రాంగం వీటి సర్వేలో తలమునకలైంది. ఈ క్రమంలోనే 318 చెరువుల ఎఫ్టీఎల్ను దాదాపుగా నిర్ధారించింది.
నగరీకరణ నేపథ్యంలో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఎఫ్టీఎల్ హద్దురాళ్లు లేకపోవడంతో అడ్డగోలుగా నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాప్రా చెరువు అన్యాక్రాంతమవుతుంద ని ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని వి చారించిన న్యాయస్థానం.. చెరువుల ఆక్రమణపై తీవ్రంగా స్పందిం చింది. నీటి వనరులు కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతి చెరువును నిశితంగా సర్వే చేయాలని, శిఖం పరిధిలో వెలిసిన అక్రమ కట్టడాలు, బాధ్యుల జాబితాను అక్టోబర్ 12లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చెరువుల సమగ్ర సర్వేకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
9లోపు సర్వే వివరాలివ్వండి: జేసీ చంపాలాల్
చెరువుల విస్తీర్ణం, ఆక్రమించిన వ్యక్తుల వివరాలను అక్టోబర్ 9లోపు సేకరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.చంపాలాల్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల సమగ్ర సర్వేకు డివిజన్లవారీగా తహసీల్దార్, సర్వేయర్, స్థానిక ఇరిగేషన్ ఏఈతో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. కబ్జాకు గురైన చెరువులు, అక్రమార్కుల జాబితాను ఈ నెల 12లోగా ఉన్నత న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున... అక్టోబర్ 9లోపు తమకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చెరువుకు సరిహద్దులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్, ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, ఇరిగేషన్ ఈఈలు భీమ్‌ప్రసాద్, వెంకటేశ్, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.