Irrigation problem
-
కేఎల్ఐ కల నెరవేరుస్తా..
తాగు, సాగునీటి కోసం కల్వకుర్తి ప్రాంత ప్రజలు దశాబ్ధాలుగా పాట్లు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పూర్తయితే ఈ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం అవుతుందని తెలిసినా నాయకులు అంతగా పట్టించుకోలేదు. నాణ్యమైన నేలలున్నా సాగునీటి సమస్యతో నిరుపయోగంగా మారాయి. స్థానికంగా బతికే పరిస్థితి లేక జనం బతుకుదెరువు కోసం హైదరాబాద్ తదితర పట్టణాలకు వలస వెళ్తున్నారు. వేసవిలో తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్ది దూరం ప్రయాణించి, వ్యవసాయ భూముల నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కల్వకుర్తి పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. కల్వకుర్తి మండలం చుట్టూ ఉన్న దుంధుబి వాగు నుంచి కొంతమంది నాయకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి హైదరాబాద్ లాంటి పట్టణాలను వందల లారీల్లో ఇసుకను తరలించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు ఇంకిపోయింది. దశాబ్ధాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సాక్షి రిపోర్టర్ గా మారి కల్వకుర్తి మండలం ఎల్లికల్, రఘుపతిపేట గ్రామాల్లో పర్యటించారు. చల్లా వంశీచంద్‌రెడ్డి : మల్లేష్ అన్నా బాగున్నవా. ఏం చేస్తున్నవే. మల్లేష్ : బాగున్న సార్. ఏముంది బావి దగ్గర పల్లి చేను వేసిన, దాని బాగోగులు చూసుకుంటున్న. ఎమ్మెల్యే : కరెంట్ బాగొస్తుందా అన్నా మల్లేష్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. వేసిన పంట చేతికందుతుందో లేదోనని భయమైతుంది. ఎమ్మెల్యే : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది. మల్లేష్ : పక్కా టయానికి వచ్చేది, టయానికి పోయేది. ఇప్పుడు కరెంట్ పోతే ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఎమ్మెల్యే : ఏం వెంకట కిష్ణన్న బాగున్నవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎందుకు లేట్ అయ్యింది అనుకున్నవు అన్నా. వెంకటకిష్ణయ్య : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ఎవరు పట్టిచ్చుకున్నరు సారూ. అప్పటి నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పటికీ ప్రాజెక్ట్ పనితీరుపై అతీగతి లేకుండా పోయింది. ఎమ్మెల్యే : మీరెప్పుడు నిలదీయలేదా వారిని. వెంకట కిష్ణయ్య : ఊళ్లోకి వచ్చిన ప్రతిసారీ దాని గురించే అడుగుతున్నం. దాని ప్రయత్నంలోనే ఉన్నామని చెప్పేవారు. ఎమ్మెల్యే : బాలన్నా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? బాలయ్య : సబ్సిడీ కోసం కాగితాలే పైకి పంపలేదంట సార్. అధికారులను అడిగితే మళ్లీ పంపుతం అన్నరు. ఎమ్మెల్యే : రుణం మాఫీ అయ్యిందా లక్ష్మయ్య తాతా. లక్ష్మయ్య : రుణం మాఫీ కాలేదు. నేను తీసుకొని చాలా రోజులు అయ్యింది. అందుకే మాఫీ కాదంట సారూ. నేను బాకీ ఉన్నది *40 వేలే. మాఫీ అయ్యిందని తెలుసుకునేందుకు నెల రోజులు బ్యాంకు, మా గ్రామంలోని రాజకీయ నాయకుల చుట్టు చెప్పులరిగేలా తిరిగిన. ఎవరూ చెప్పలే. తర్వాత లిస్ట్‌లో నా పేరు రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే : పింఛన్ వస్తుందా? జంగయ్య : వస్తలేదు సారూ. అధికారులను అడిగితే, మళ్ల నెల వస్తదంటున్నరు. 2నెలలుగా ఫించన్ రాకపోవడంతో ఇంట్లో తినేందుకు రేషన్ బియ్యం కొనే పరిస్థితి లేదు. పింఛన్ ఇస్తరేమోనని, గ్రామ పంచాయతీ, మండల ఆపీసుల చుట్టు రోజూ తిరుగుతున్న. ఎవరూ పట్టించుకుంటలేరు. చాన మందికి రాలేదు. అందులో నువ్వు ఒక్కదానివి. అందరికి వచ్చినప్పుడు నీకు వస్తయంటున్నరు. ఎమ్మెల్యే : ప్రజలకు ఏం కావాలనే సరైన అవగాహన ప్రభుత్వం, అధికారులకు లేకపోవడంతోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. ప్రజల తరఫున పోరాడి అర్హులందరికీ ఫించన్ అందేలా చేస్తా. ఎమ్మెల్యే : పిల్లలు ఏం చేస్తున్నారు మల్లయ్య తాతా మల్లయ్య : నాకు రెండెకరాల పొలమే ఉంది. దాన్ని నమ్ముకొని వాళ్లను పోషించిన. కానీ దానిపై ఆధారపడితే బతకలేరుగా అందుకే హైదరాబాద్‌లో పనికి వెళ్లారు. ఎమ్మెల్యే : చదువుకునే వసతులున్నాయా ఊళ్లో చంద్రశేఖర్ : ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే చదువుకుంటే ఉద్యోగం వస్తదనే ఆశలేదు. చాలామంది చిన్నప్పటి నుంచి పనిలో పెట్టారు. నేను కూడా పనిలో పెట్టా. వాళ్లు ప చేసుకొని బతుకుతున్నరు. ఎమ్మెల్యే : ఏం అమ్మమ్మా కూలి పనులకు వెళ్తున్నారా జంగమ్మ : వరినాటు పనులకు వెళ్తున్న నాయనా. కూలికి పోకుంటే ఎవరు బువ్వ పెడతరు. ఎమ్మెల్యే : ఉపాధి పనులు నిలిపేశారు కదా. ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అక్కా. నారమ్మ : ఉపాధి వచ్చినందుకే ఊళ్లలో కూలిరేట్లు పెంచారు. అంతకుముందు *50 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు *200 వరకు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపాధి కూలీలను నిలిపేయడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎమ్మెల్యే : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు అర్ధం చేసుకొని, వారిని ఇబ్బందుల నుంచి గట్టింక్కించాలనే సదుద్దేశ్యంతో ఉపాధి హామీ పనులు ప్రారంబించింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దానిని నిర్వీర్యం చేయాలని చూస్తుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి తాతా. కోటయ్య : అధికారం చేతిలో ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్లు చేస్తే, అది సరైంది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వం నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అలా కాకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే, అలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఎమ్మెల్యే : గ్రామంలో అంగన్వాడీ కేంద్రం బాగా నడుస్తుందా. కేంద్రంలో పోషక పదార్థాలు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారా. లక్ష్మి : వారంలో 3, 4 రోజులు మాత్రమే తెరుస్తారు. మిగతా రోజులు తెరువరు. కేంద్రం తెరిచిన రోజు, మిగతా సరుకులు పంపిణీ చేయమంటే చేయరు. గ ర్బిణీ, బాలింతలు, చిన్నారులకు అవసరమైన రీతిలో పంపిణీ చేయడం లేదు. ఎమ్మెల్యే : పీహెచ్సీ కేంద్రం పనితీరు ఎలా ఉంది. వైద్యులు సమయానికి వస్తున్నారా. రాములు : మా గ్రామంలో (రఘుపతిపేట) పీహెచ్సీ కేంద్రం ఉందనే మాటే కానీ.. ఎప్పుడూ ఉపయోగపడదు. డాక్టర్లు జెండా పండగనాడు, ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిస్తేనే వస్తారు. ఎమ్మెల్యే : ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయా. శంకరయ్య : ఎప్పుడో అమాస, పున్నానికి వచ్చే డాక్టర్లు, రోగులను పరీక్షించడం వరకే చేస్తరు. మందులు కావాలంటే కల్వకుర్తికి చీటీలు రాసి తెచ్చుకోమంటారు. ఆస్పత్రికి వస్తే పరీక్షిస్తారనే నమ్మకం లేదు. రోగుల సమస్యలు అస్సలు పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, సాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, KALWAKURTHY lift irrigation scheme, irrigation problem, the problem of fluoride -
సాగు నీరివ్వకుంటే మంత్రి ఛాంబర్ ముట్టడి
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి అవనిగడ్డ/కోడూరు : రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నాలుగు రోజుల్లోపు సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలసి ఇరిగేషన్‌మంత్రి ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి,మాజీమంత్రి కె.పార్థసారథి హెచ్చరించారు. కోడూరు మండలంలోని వివిధ తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి వచ్చిన అనంతరం శనివారం రాత్రి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారథి మాట్లాడుతూ కృష్ణాడెల్టా పరిరక్షకునిగా చెప్పుకునే రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, అభినవకాటన్ దొరగా తనకు తానే అభివర్ణించుకుంటూ...రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారిన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఈ విషయమై నోరుమెదపరేమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఖరీఫ్ సీజన్ సమయం కూడా మారిపోయిందని, జూన్, జులై మాసాల్లో నాట్లు పూర్తిచేసుకునే కృష్ణాడెల్టా రైతాంగం సెప్టెంబరు మాసం వచ్చినప్పటికీ నాట్లువేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రైతుల కష్టాలు, వారు పడుతున్న ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాధ్యతగల మంత్రులను భూసేకరణ కోసం భాగస్వాములను చేయటాన్ని చూస్తే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అవగతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ పంట రుణాలకు, వ్యవసాయ రుణాలకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తుండటం రైతులు చేసుకున్న దురదృష్టమన్నారు. రైతులను అన్ని విధాలుగా మోసగించి అమలు సాధ్యంకాని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రైతులు కనువిప్పు కలిగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశా రు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బా బు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, మొవ్వ మండల పార్టీ కన్వీనర్ చిందా వీరవెంకట నాగేశ్వరరా జు, అవనిగడ్డ సర్పం చి నలుకుర్తి పృధ్వీరాజ్, వి.కొత్తపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు రేపల్లె పిచ్చేశ్వరరావు, రైతు నాయకుడు గాజుల శ్రీనివాసరావు, రాధా-రంగామిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
విభజనతో సాగునీటి సమస్య జటిలం
గుడ్లవల్లేరు/గుడివాడరూరల్/కృత్తివెన్ను, న్యూస్‌లైన్ : తెలంగాణ విభజనతో సాగునీటి సమస్య మరింత జఠిలం కానుందని కేంద్ర బృందం ఎదుట కౌతవరం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కె.శ్రీరామవర్మ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం బుధవారం గుడ్లవల్లేరుమండలంలోని కౌతారం,గుడివాడ మండలంలోని తట్టివర్రు గ్రామంలోనూ,కృత్తివెన్ను మండలం లక్ష్మిపురం గ్రామంలోనూ పర్యటించింది. కౌతవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ విభజన జరుగక ముందే గత ఖరీఫ్‌లో అదునుకు సాగునీరివ్వవ్వలేదని, విభజనతో మరింత నష్టపోతామని కేంద్రబృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారంతో పాటు కొంతమందికే ఇన్సూరెన్స్ అందుతుందని అన్నారు. నష్టపోయిన అర్హులైన రైతులందరికీ బీమా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు అభ్యంతరాల వల్లనే సాగునీటిని ఆలస్యంగా వదిలే పరిస్థితి తలెత్తినట్లు ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు కేంద్ర బృందానికి సమాధానమిచ్చారు. జిల్లాలో ్ట1.67లక్షల మంది రైతులకు నష్టం... హెలెన్ తుఫాను వల్ల జిల్లాలో 1.67లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ వి.నరసింహులు తెలిపారు. దాదాపు 80వేల హెక్టారుల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. కౌతవరం రైతులతో కేంద్ర బృందం ప్రతినిధి శ్రీరామవర్మ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు పంటనష్ట పరిహార అంచనాల్ని ప్రభుత్వానికి నివేదిక పంపారని, నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లను నిర్మించరూ... తుఫాన్లకు గ్రామంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారిపోయాయని కౌతవరం గ్రామ సర్పంచి పడమటి సుజాత కేంద్ర బృందానికి వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర బృందం కౌతవరం రావటానికి ముందుగా తుఫాన్ల కోతకు గురైన మామిడికోళ్ల మీదుగా లంకాదొడ్డి, డోకిపర్రు జిల్లా పరిషత్ రోడ్డును పరిశీలించారు. లెక్కలు సరి చూసుకోండి.... తట్టివర్రు గ్రామంలోని పంట పోలాలను, రోడ్డును కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించిస్థానిక రైతులన వివరాలడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు చూపిన లెక్కలకు కేంద్ర కమిటీకి నివేదించిన జాబితాకు పొంతన కుదరకపోవటంతో కేంద్రకమిటీ సభ్యులు ఆర్పీ సింగ్ ఆసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి పొరపాటు వల్లనే నిధులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. నష్టపరిహారాన్ని పెంచండి.... హెలెన్, లెహర్ తుపానుల నష్టపరిహారాన్ని ఎకరానికి రూ. 4వేల నుంచి రూ. 8వేలకు పెంచాలని కేంద్ర బృందానికి కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రైతులు విజ్ఞప్తి చేశారు. పర్యటనలో కేంద్ర బృందానికి చెందిన ఆర్.పి.సింగ్, ఎ.కృష్ణప్రసాద్, పంచాయయితీరాజ్ ఎస్ఈ జి.జయరాజ్, ఈఈ పి.అశోక్‌కుమార్, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, వ్యవసాయశాఖ జిల్లా డీడీ వెంకటేశ్వరరావు, రూరల్ డెవలప్మెంట్ అధికారి కె.రాంవర్మ, ఏడీఏ మణిధర్, బంటుమిల్లి ఏడీఏ మురళీకృష్ణ, గుడ్లవల్లేరు తహశీల్దార్ మైకేల్‌రాజు, ఆర్.ఐ వై.లక్ష్మీనారాయణ, ఏఈవో పి.దివ్య, జెడ్పీ ఏఈ ఆర్.రాఘవులు, రైతులు పడమటి నాంచారయ్య, కానూరి సత్తిబాబు, నాంజీ, వడ్లమూడి యుగంధర్, చాపరాల జగన్మోహనరావు, కానూరి రాజేంద్రప్రసాద్, ఈడె రామారావు, సునీల్, పోతురాజు, ఆదర్శ రైతులు శ్రీనివాసరరావు, సుబ్బారావు తదితరులున్నారు.