breaking news
Irrigation SE Sarada
-
వదల బొమ్మాళీ..!
►పట్టు విడువని టీడీపీ ముఖ్య నేత ►ఎన్ఎస్పీ స్థలం కోసం వేగంగా కదులుతున్న పావులు ►క్వాలిటీ కంట్రోల్‌ను అడ్డుపెట్టి నివేదిక ►లూజ్ సాయిల్ అంటూ నివేదిక ఇప్పించే యత్నం ►ఎన్ఎస్పీ భవన నిర్మాణానికి స్థలం పనికిరాదంటూ కొత్త వాదన ►ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆపే ఎత్తుగడ ►ఇరిగేషన్ మంత్రిని అడ్డుపెట్టి పనులు నిలిపివేత ►99 ఏళ్ల లీజుకు స్థల స్వాధీనానికి యత్నం ఒంగోలు: ఇరిగేషన్ ఎస్ఈ శారదను పట్టుపట్టి బదిలీ చేయించిన టీడీపీ జిల్లా ముఖ్యనేత అంతే పట్టుదలతో 1.92 ఎకరాల ఎన్ఎస్పీ(నాగార్జున సాగర్ ప్రాజెక్టు) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ స్థలం భవన నిర్మాణానికి పనికి రాదంటూ ఇరిగేషన్ క్వాలిటీ విభాగం ద్వారా నివేదిక ఇచ్చే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎన్ఎస్పీ సర్కిల్ కార్యాలయ పనులను బుధవారం ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు పరిశీలించారు. ఇరిగేషన్ మంత్రి ద్వారా భవన నిర్మాణ పనులను ఆపేందుకు సర్వం సిద్ధం చేశారు. 99 సంవత్సరాల లీజుకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. 99 సంవత్సరాల లీజుకు స్థలం కావాలంటూ ఇరిగేషన్ మంత్రికి ఇప్పటికే ప్రతిపాదనలిచ్చిన అధికార పార్టీ నేత త్వరగా స్థలాన్ని స్వాధీనం చేయాలంటూ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే నీటిపారుదల శాఖ రూ.5 కోట్ల నిధులతో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టింది. రెండు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుతం పునాదుల దశలో ఉంది. భవన నిర్మాణ పనులు ఆగితేనే 1.92 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసేందుకు వీలవుతుందని అధికార పార్టీ నేతకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా టీడీపీ నేత తక్షణం భవన నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఇరిగేషన్ సీఈతో పాటు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. మరోవైపు సాంకేతికంగా సాకు చూపి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సదరు నేత సిద్ధమయ్యారు. ప్రస్తుతం సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం బ్లాక్ సాయిల్(నల్లనేల) ఉందని, ఇది భవన నిర్మాణానికి అనుకూలత లేదని క్వాలిటీ కంట్రోల్ ద్వారా నివేదిక ఇప్పించేందుకు వ్యూహం పన్నారు. భవన నిర్మాణానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ, ఇరిగేషన్) డిజైన్ ఇచ్చింది. వారు సూచించిన మేరకు 2.6 మీటర్ల లోతు పునాదులు తీయాలి. బ్లాక్ సాయిల్ కావడంతో ఈ లెక్కన 7.5 టన్ను ఫర్ స్కైర్ఫీట్ సామర్థ్యం మాత్రమే కలిగి ఉందని ఈ మేరకు సీడీఓ డిజైన్ రూపొందించి ఇచ్చింది. వాస్తవంగా మొరం, సుద్ధ లాంటి సాయిల్ అయితే 15 నుంచి 20 టన్ను ఫర్ స్కైర్ఫీట్ సామర్థ్యం ఉంటుంది. దీంతో పోలిస్తే ప్రస్తుతం భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం బ్లాక్ లూజ్ సాయిల్ కావడంతో తక్కువ సామర్థ్యం ఉన్నట్లే అని అధికారుల వాదన. పైన కనబరిచిన టెక్నికల్ కారణాన్ని చూపి భవన నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా లేదని తేల్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే నివేదికను సాకుగా చూపి ఇరిగేషన్ మంత్రి ద్వారా ఒత్తిడి తెచ్చి తొలుత భవన నిర్మాణాన్ని ఆపించాలని టీడీపీ జిల్లా నేత ప్రణాళిక సిద్ధం చేశారు. పరిసరాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు.. వాస్తవానికి ఇదే ప్రాంతంలో ప్రగతి భవన్, నాగార్జున యూనివర్సిటీకి చెందిన భవనాలతో పాటు సమీపంలోనే 8 అంతస్తులు నిర్మించిన అపార్టుమెంట్లు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ భవనాలతో పాటు కుప్పలుతెప్పలుగా వెలిశాయి. వాటికి వర్తించని లూజ్ సాయిల్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ భవనానికి ఎలా వర్తిస్తున్నందే ప్రశ్న. ఇదే విషయాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం పేర్కొనడం గమనార్హం. ఇక టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసమే స్థంల అడుగుతున్నట్లు జిల్లా ముఖ్యనేత చెబుతున్నా విషయం తెలిసిందే. అదే జరిగితే ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి అనువుగా లేని స్థలం టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎలా అనువుగా ఉంటుందన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఈ లెక్కన నిజంగానే ’25 కోట్ల విలువైన ఈ స్థలం టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యనేత అడుగుతున్నారా...? లేక 99 సంవత్సరాల లీజుకు స్థలాన్ని కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక పక్క ప్రధానమైన నీటిపారుదల శాఖకు సొంత భవనాలు కూడా లేక అధికారులు ఇబ్బందులు పడుతుంటే విలువైన శాఖ స్థలాన్ని వారి భవన నిర్మాణం కోసం కాకుండా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం అధికార పార్టీ నేత ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ సాక్షాత్తు ఇరిగేషన్ ఎస్ఈ శారదను పట్టుపట్టి బదిలీ చేయించడంపై ఆ శాఖ అధికారులతో పాటు అధికార టీడీపీ వర్గాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా... కలెక్టర్ మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. విలువైన ప్రభుత్వ స్థలం పార్టీ కార్యాలయం పేరుతో కొట్టేసేందుకు టీడీపీ నేత సిద్ధమవుతున్నా జిల్లా పాలనాధికారి పట్టించుకోకపోవడం బాధాకరమన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది. -
ధిక్కారమున్ సైతునా..!
►ఇరిగేషన్ ఎస్ఈ శారదపై బదిలీ వేటు ►టీడీపీ కార్యాలయానికి ఎన్ఎస్పీ స్థలం ఇవ్వకపోవడమే కారణం ►పట్టుపట్టి బదిలీ చేయించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు? ►ప్రభుత్వానికి సరెండర్ ∙ కొత్త ఎస్ఈగా వెంకటరమణ ►ఎస్ఈ బదిలీపై అధికార పార్టీలోనే ఆగ్రహావేశాలు అంతా అనుకున్నట్టే.. జరిగింది. ఇరిగేషన్ ఎస్ఈ శారదపై బదిలీ వేటు పడింది. టీడీపీ జిల్లా కార్యాలయానికి కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాల ఎన్ఎస్పీ (నాగార్జున సాగర్ ప్రాజెక్టు) స్థలాన్ని ఇచ్చేందుకు ఎస్ఈ శారద అంగీకరించకపోవడమే ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతల మాట ధిక్కరిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఒంగోలు : టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎన్ఎస్పీ స్థలాన్నిచ్చేందుకు ఇరిగేషన్ ఎస్ఈ శారద అడ్డుచెప్పారు. దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శారదపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శారదను బదిలీ చేయాల్సిందేనని జనార్దన్ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ బదిలీలు లేనప్పటికీ ఆమెను మంగళవారం బదిలీ చేశారు. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సరెండర్ చేశారు. ఎస్ఈని బదిలీ చేయించటంపై అధికార పార్టీ వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. ఎన్ఎస్పీ కార్యాలయ పనులు ప్రారంభం.. టీడీపీ కార్యాలయం కోసం అడుగుతున్న రెండెకరాల స్థలంలో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.5 కోట్ల నిధులు కేటాయించారు. నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. మరోవైపు 99 ఏళ్ల లీజు పేరుతో ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నెం.88లో నాగార్జున సాగర్‌ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) 1.92 ఎకరాల విలువైన స్థలాన్ని తమకు అప్పగించాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఇరిగేషన్ అధికారులను కోరారు. స్థలంలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించతలపెట్టినట్లు చెప్పారు. స్థలాన్ని టీడీపీ కార్యాలయానికిచ్చే విధంగా ప్రతిపాదనలివ్వాలని దామచర్ల ఇరిగేషన్ ఎస్ఈ శారదను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఎన్ఎస్పీకి సొంత భవనం కూడా లేదని, ప్రస్తుతం ఇరిగేషన్ పరిధిలో ఉన్న భవనాలు చిన్నపాటి వర్షానికే నీట మునుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న స్థలంలో సొంత భవనం నిర్మించాలని నిర్ణయించినట్లు ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడికి వివరించింది. బదిలీకి ఒత్తిళ్లు.. ఎట్టి పరిస్థితుల్లో స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వలేమని ఆమె తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన దామచర్ల ఎన్ఎస్పీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతం కాక ముందే ఎస్ఈ శారదను బదిలీ చేయాలని ఇరిగేషన్ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రి శారదను బదిలీ చేశారు. ఆమె స్థానంలో నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణను బదిలీ చేసినట్లు సమాచారం. సాధారణ బదిలీలు కూడా లేని సమయంలో కేవలం టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఎన్ఎస్పీ స్థలాన్ని ఇవ్వలేదన్న అక్కసుతో ఎస్ఈని బదిలీ చేయటం సొంత పార్టీ వర్గాలే విమర్శిస్తున్నడటం గమనార్హం. కలెక్టర్ గొడవ కూడా కారణమా..? ఎస్ఈ శారద బదిలీకి ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ మధ్య తలెత్తిన విభేదాలు కూడా కారణంగా తెలుస్తోంది. కలెక్టర్ రివ్యూ సమావేశాల్లో తమను అనవసరంగా తిడుతున్నాడంటూ ఇరిగేషన్ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ ఎస్ఈ శారదే కారణమని కలెక్టర్ భావించారు. ఈ నేపథ్యంలో శారదపై ఒక దశలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరకుండా ఎమ్మెల్సీ కరణం బలరాం సర్దుబాటు చేశారు. కలెక్టర్ సైతం శారద పనితీరుకు వ్యతిరేకంగా ఇరిగేషన్ మంత్రితో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు సైతం పార్టీ కార్యాలయానికి ఇరిగేషన్ ఎస్ఈ స్థలమివ్వకపోవడాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. పైకి కలెక్టర్ ఏటూ తేల్చకపోయినా ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మొత్తంగా అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఒత్తిడి, ఇటు కలెక్టర్‌తో విభేదాల నేపథ్యంలో శారద బదిలీ అయినట్లు సమాచారం.