ధిక్కారమున్‌ సైతునా..! | Irrigation officer Saradha will be transferred | Sakshi
Sakshi News home page

ధిక్కారమున్‌ సైతునా..!

Published Wed, Jul 12 2017 1:18 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

ధిక్కారమున్‌ సైతునా..! - Sakshi

ధిక్కారమున్‌ సైతునా..!

ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదపై బదిలీ వేటు
టీడీపీ కార్యాలయానికి ఎన్‌ఎస్‌పీ స్థలం ఇవ్వకపోవడమే కారణం
పట్టుపట్టి బదిలీ చేయించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు?
ప్రభుత్వానికి సరెండర్‌  ∙ కొత్త ఎస్‌ఈగా వెంకటరమణ
ఎస్‌ఈ బదిలీపై అధికార పార్టీలోనే ఆగ్రహావేశాలు


అంతా అనుకున్నట్టే.. జరిగింది. ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదపై బదిలీ వేటు పడింది. టీడీపీ జిల్లా కార్యాలయానికి కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాల ఎన్‌ఎస్‌పీ (నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు) స్థలాన్ని ఇచ్చేందుకు ఎస్‌ఈ శారద అంగీకరించకపోవడమే ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతల మాట ధిక్కరిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.

ఒంగోలు : టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎన్‌ఎస్‌పీ స్థలాన్నిచ్చేందుకు ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారద అడ్డుచెప్పారు. దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ శారదపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శారదను బదిలీ చేయాల్సిందేనని జనార్దన్‌ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ బదిలీలు లేనప్పటికీ ఆమెను మంగళవారం బదిలీ చేశారు. ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వకుండా సరెండర్‌ చేశారు. ఎస్‌ఈని బదిలీ చేయించటంపై అధికార పార్టీ వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి.

ఎన్‌ఎస్‌పీ కార్యాలయ పనులు ప్రారంభం..
టీడీపీ కార్యాలయం కోసం అడుగుతున్న రెండెకరాల స్థలంలో ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.5 కోట్ల నిధులు కేటాయించారు. నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. మరోవైపు 99 ఏళ్ల లీజు పేరుతో ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నెం.88లో నాగార్జున సాగర్‌ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) 1.92 ఎకరాల విలువైన స్థలాన్ని తమకు అప్పగించాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ఇరిగేషన్‌ అధికారులను కోరారు. స్థలంలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించతలపెట్టినట్లు చెప్పారు. స్థలాన్ని టీడీపీ కార్యాలయానికిచ్చే విధంగా ప్రతిపాదనలివ్వాలని దామచర్ల ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదను ఆదేశించినట్లు సమాచారం. అయితే  ఎన్‌ఎస్‌పీకి సొంత భవనం కూడా లేదని, ప్రస్తుతం ఇరిగేషన్‌ పరిధిలో ఉన్న భవనాలు చిన్నపాటి వర్షానికే నీట మునుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న స్థలంలో సొంత భవనం నిర్మించాలని నిర్ణయించినట్లు ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడికి వివరించింది.

బదిలీకి ఒత్తిళ్లు..
ఎట్టి పరిస్థితుల్లో స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వలేమని ఆమె తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన దామచర్ల ఎన్‌ఎస్‌పీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతం కాక ముందే ఎస్‌ఈ శారదను బదిలీ చేయాలని ఇరిగేషన్‌ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రి శారదను బదిలీ చేశారు. ఆమె స్థానంలో నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణను బదిలీ చేసినట్లు సమాచారం. సాధారణ బదిలీలు కూడా లేని సమయంలో కేవలం టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని ఇవ్వలేదన్న అక్కసుతో ఎస్‌ఈని బదిలీ చేయటం సొంత పార్టీ వర్గాలే విమర్శిస్తున్నడటం గమనార్హం.

కలెక్టర్‌ గొడవ కూడా కారణమా..?
ఎస్‌ఈ శారద బదిలీకి ఇరిగేషన్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మధ్య తలెత్తిన విభేదాలు కూడా కారణంగా తెలుస్తోంది. కలెక్టర్‌ రివ్యూ సమావేశాల్లో తమను అనవసరంగా తిడుతున్నాడంటూ ఇరిగేషన్‌ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. దీనికి ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదే కారణమని కలెక్టర్‌ భావించారు. ఈ నేపథ్యంలో శారదపై ఒక దశలో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరకుండా ఎమ్మెల్సీ కరణం బలరాం సర్దుబాటు చేశారు. కలెక్టర్‌ సైతం శారద పనితీరుకు వ్యతిరేకంగా ఇరిగేషన్‌ మంత్రితో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు సైతం పార్టీ కార్యాలయానికి ఇరిగేషన్‌ ఎస్‌ఈ స్థలమివ్వకపోవడాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. పైకి కలెక్టర్‌ ఏటూ తేల్చకపోయినా ఎన్‌ఎస్‌పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మొత్తంగా అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఒత్తిడి, ఇటు కలెక్టర్‌తో విభేదాల నేపథ్యంలో శారద బదిలీ అయినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement