నాగార్జున సాగర్ కాల్వల మరమ్మతుల్లో అవినీతి పరవళ్లు
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు వాటాలు
టీడీపీ నాయకులే సబ్ కాంట్రాక్టర్లు
నాసిరకం మట్టితో పనులు.. అరకొరగానే క్యూరింగ్
పనులు పూర్తికాకుండానే శిథిలమవుతున్న కాల్వలు
కృష్ణా జిల్లాలో నీళ్లురాని కాల్వలకు సైతం మరమ్మతులు
అవకతవకలను అడ్డుకోలేకపోతున్న అధికారులు
హైదరాబాద్ : దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇదే! నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్‌ఎస్‌పీ) కాల్వల ఆధునికీకరణ పనుల్లో అంతులేని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కాంట్రాక్టర్లు వాటాలు పంచేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు పిండుకున్న ప్రజాప్రతినిధులు, పనిలోపనిగా తమ అనుచరులకు పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇప్పించేసుకున్నారు. సబ్ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నా జల వనరుల శాఖ అధికారులు ఇదేమిటని ప్రశ్నించలేకపోతున్నారు. ఫలితంగా పనుల్లో నాణ్యత లోపిస్తోంది. నాలుగు కాలాలపాటు నీళ్లు పారాల్సిన కాల్వలు పనులు పూర్తికాకుండానే శిథిల మవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రపంచబ్యాంకుతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నిధులు రాబట్టారు. కాల్వల ఆధునికీకరణకు రూ.4,444 కోట్లు విడుదల చేస్తూ ప్రపంచ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.2,832.69 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా రూ.1359.69 కోట్లు కాగా, రాష్ట్ర సర్కారు వాటా రూ.1,473 కోట్లు. ఏపీలో ఇప్పటివరకు 73 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
లేని కాల్వలకు మరమ్మతులట!
కాల్వల మరమ్మతు పనుల్లో అక్రమాలు అన్నీఇన్నీ కావు. నీరు వచ్చే అవకాశం లేని కాల్వలకు సైతం మరమ్మతులు చేపట్టారు. కొన్నిచోట్ల కాల్వల జాడ కనిపించడం లేదు. అయినా వాటిని మరమ్మతు చేశామంటూ రికార్డుల్లో చూపి, నిధులు నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాల్వగట్లను పటిష్టం చేయడానికి నాణ్యమైన మట్టిని ఉపయోగించాల్సి ఉంటుంది. చెరువుల్లోని మట్టిని తరలించారు. ఇందుకు నీరు-చెట్టు పథకాన్ని ఉపయోగించుకున్నారు. కొన్నిచోట్ల కాల్వగట్లకు సమీపంలో తవ్వితీసిన మట్టినే ఉపయోగించారు. నాసిరకం మట్టి వల్ల కాల్వగట్లు బలహీనపడ్డాయి. కట్టలను పటిష్టపర్చడానికి రోడ్డు రోలర్‌ను ఉపయోగించిన దాఖలాలు లేవు. లైనింగ్ వర్క్‌కు అరకొరగానే క్యూరింగ్ చేశారు. కట్టల పైభాగంలో తొమ్మిది అంగుళాల మేరకు గ్రావెల్ వేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పై పూతలే తప్ప కాల్వలు బాగుపడ్డ ఆనవాళ్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాల్వల పనుల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను టీడీపీ నేతలు బదిలీ చేయించారు.
మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్న పనులు
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్సు సంస్థ అమరావతి మేజర్ కెనాల్‌పై చేపట్టిన పనుల్లో నిబంధనలు అమలు కావడం లేదు. 39 నెలల్లో పనులను పూర్తి చేస్తామని 2012 సెప్టెంబరు 15న ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ ఇప్పటిదాకా 65 శాతం పనులు చేసినట్టు చెబుతోంది. అయితే. ఆ మేరకు పనులు జరగలేదని రైతులు అంటున్నారు. ఈ పనులను పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు ముఖ్య అనుచరుడు, అమరావతి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు నంబూరి తులసిబాబు చేస్తున్నారు. అందుకే అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించాలంటే అధికారులు జంకుతున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్, నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో కాల్వల లైనింగ్ పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. కాల్వలకు నీరు విడుదల కాకుండానే, గట్లకు చేసిన సిమెంట్ లైనింగ్ పెచ్చులుగా రాలిపోతోంది. సత్తెనపల్లి, మేరికపూడి, తొండెపి, గోరంట్ల మేజర్ కాల్వలపై జరుగుతున్న మట్టి పనుల్లో నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే కట్టలు కోతకు గురవుతున్నాయి.
మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, బుగ్గవాగు రిజర్వాయర్ల నుంచి కారంపూడికి వెళ్లే కాల్వల బెడ్ ైలైనింగ్ ఒక సీజన్‌కే పరిమితమైంది. గత ఏడాది ఈ కాల్వల బెడ్‌లకు వేసిన లైనింగ్, ఈ ఏడాది కాల్వలకు విడుదల చేసిన నీటి ప్రవాహానికి దెబ్బతిని, అక్కడక్కడ కాంక్రీట్ లేచిపోయింది.
అదనపు సొమ్ము మంత్రులకు!
ప్రకాశం జిల్లాలో నిర్మాణ సంస్థలు సిండికేట్ అయ్యేలా చేసి, అంచనాలపై అదనంగా 14 శాతం రేట్‌ను ఇప్పించి, ఆ అదనపు సొమ్మును జిల్లా మంత్రికి, జలవనరుల శాఖమంత్రికి అందించారనే ఆరోపణలున్నాయి. అక్కడ రూ.400 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అగ్రిమెంట్ విలువలో పాలకులు, అధికారుల కమీషన్లు, నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్ల లాభాలు పోను 50 శాతం నిధులతోనే పనులు జరగడంతో వాటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
60 శాతం సొమ్ము పక్కదారి ...
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత జిల్లా కృష్ణాలో అగ్రిమెంట్ విలువలో 40 శాతానికి మించి పనులు జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన 60 శాతం సొమ్ము ప్రజాప్రతినిధులు, నేతలకు కమీషన్ల రూపంలో ముడుతోంది. టెండర్ పొందిన నిర్మాణ సంస్థ పనులను ప్రారంభించాలంటే ముందుగా జల వనరుల శాఖ మంత్రి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాలి. వారి అనుచరులకు సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులను అప్పగించాలి. ఆ తరువాతే మిగిలిన పనిని చేపట్టాల్సి ఉంటుంది.
నూజివీడు నియోజకవర్గ పరిధిలో రూ.186 కోట్లతో కాల్వల మరమ్మతులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటిలో అధిక శాతం పనులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సబ్ కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. సాగర్ ఎడమ కాలువకు గన్నవరం మండలం చిట్టచివరి ప్రాంతం. 40 సంవత్సరాల క్రితం తమ ప్రాంతానికి సాగర్ నీరు రావడం చూశామని అక్కడి పెద్దలు చెబుతున్నారు. నీటి విడుదల లేకపోవడంతో కాల్వలు పక్కనున్న పొలాల్లో కలిసిపోయాయి. కాల్వలు లేకపోయినా ప్రభుత్వం మరమ్మతుల పేరిట నిధులు వృథా చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.