Sub-contractors
-
ఆధునికీకరణలో అంతులేని అక్రమాలు
నాగార్జున సాగర్ కాల్వల మరమ్మతుల్లో అవినీతి పరవళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు వాటాలు టీడీపీ నాయకులే సబ్ కాంట్రాక్టర్లు నాసిరకం మట్టితో పనులు.. అరకొరగానే క్యూరింగ్ పనులు పూర్తికాకుండానే శిథిలమవుతున్న కాల్వలు కృష్ణా జిల్లాలో నీళ్లురాని కాల్వలకు సైతం మరమ్మతులు అవకతవకలను అడ్డుకోలేకపోతున్న అధికారులు హైదరాబాద్ : దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇదే! నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్ఎస్పీ) కాల్వల ఆధునికీకరణ పనుల్లో అంతులేని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కాంట్రాక్టర్లు వాటాలు పంచేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు పిండుకున్న ప్రజాప్రతినిధులు, పనిలోపనిగా తమ అనుచరులకు పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇప్పించేసుకున్నారు. సబ్ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నా జల వనరుల శాఖ అధికారులు ఇదేమిటని ప్రశ్నించలేకపోతున్నారు. ఫలితంగా పనుల్లో నాణ్యత లోపిస్తోంది. నాలుగు కాలాలపాటు నీళ్లు పారాల్సిన కాల్వలు పనులు పూర్తికాకుండానే శిథిల మవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రపంచబ్యాంకుతో పలుమార్లు సంప్రదింపులు జరిపి నిధులు రాబట్టారు. కాల్వల ఆధునికీకరణకు రూ.4,444 కోట్లు విడుదల చేస్తూ ప్రపంచ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.2,832.69 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా రూ.1359.69 కోట్లు కాగా, రాష్ట్ర సర్కారు వాటా రూ.1,473 కోట్లు. ఏపీలో ఇప్పటివరకు 73 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. లేని కాల్వలకు మరమ్మతులట! కాల్వల మరమ్మతు పనుల్లో అక్రమాలు అన్నీఇన్నీ కావు. నీరు వచ్చే అవకాశం లేని కాల్వలకు సైతం మరమ్మతులు చేపట్టారు. కొన్నిచోట్ల కాల్వల జాడ కనిపించడం లేదు. అయినా వాటిని మరమ్మతు చేశామంటూ రికార్డుల్లో చూపి, నిధులు నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాల్వగట్లను పటిష్టం చేయడానికి నాణ్యమైన మట్టిని ఉపయోగించాల్సి ఉంటుంది. చెరువుల్లోని మట్టిని తరలించారు. ఇందుకు నీరు-చెట్టు పథకాన్ని ఉపయోగించుకున్నారు. కొన్నిచోట్ల కాల్వగట్లకు సమీపంలో తవ్వితీసిన మట్టినే ఉపయోగించారు. నాసిరకం మట్టి వల్ల కాల్వగట్లు బలహీనపడ్డాయి. కట్టలను పటిష్టపర్చడానికి రోడ్డు రోలర్‌ను ఉపయోగించిన దాఖలాలు లేవు. లైనింగ్ వర్క్‌కు అరకొరగానే క్యూరింగ్ చేశారు. కట్టల పైభాగంలో తొమ్మిది అంగుళాల మేరకు గ్రావెల్ వేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పై పూతలే తప్ప కాల్వలు బాగుపడ్డ ఆనవాళ్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాల్వల పనుల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను టీడీపీ నేతలు బదిలీ చేయించారు. మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్న పనులు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో హైగ్రీవా ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్సు సంస్థ అమరావతి మేజర్ కెనాల్‌పై చేపట్టిన పనుల్లో నిబంధనలు అమలు కావడం లేదు. 39 నెలల్లో పనులను పూర్తి చేస్తామని 2012 సెప్టెంబరు 15న ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ ఇప్పటిదాకా 65 శాతం పనులు చేసినట్టు చెబుతోంది. అయితే. ఆ మేరకు పనులు జరగలేదని రైతులు అంటున్నారు. ఈ పనులను పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు ముఖ్య అనుచరుడు, అమరావతి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు నంబూరి తులసిబాబు చేస్తున్నారు. అందుకే అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించాలంటే అధికారులు జంకుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్, నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో కాల్వల లైనింగ్ పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. కాల్వలకు నీరు విడుదల కాకుండానే, గట్లకు చేసిన సిమెంట్ లైనింగ్ పెచ్చులుగా రాలిపోతోంది. సత్తెనపల్లి, మేరికపూడి, తొండెపి, గోరంట్ల మేజర్ కాల్వలపై జరుగుతున్న మట్టి పనుల్లో నాణ్యత లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే కట్టలు కోతకు గురవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, బుగ్గవాగు రిజర్వాయర్ల నుంచి కారంపూడికి వెళ్లే కాల్వల బెడ్ ైలైనింగ్ ఒక సీజన్‌కే పరిమితమైంది. గత ఏడాది ఈ కాల్వల బెడ్లకు వేసిన లైనింగ్, ఈ ఏడాది కాల్వలకు విడుదల చేసిన నీటి ప్రవాహానికి దెబ్బతిని, అక్కడక్కడ కాంక్రీట్ లేచిపోయింది. అదనపు సొమ్ము మంత్రులకు! ప్రకాశం జిల్లాలో నిర్మాణ సంస్థలు సిండికేట్ అయ్యేలా చేసి, అంచనాలపై అదనంగా 14 శాతం రేట్‌ను ఇప్పించి, ఆ అదనపు సొమ్మును జిల్లా మంత్రికి, జలవనరుల శాఖమంత్రికి అందించారనే ఆరోపణలున్నాయి. అక్కడ రూ.400 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అగ్రిమెంట్ విలువలో పాలకులు, అధికారుల కమీషన్లు, నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్ల లాభాలు పోను 50 శాతం నిధులతోనే పనులు జరగడంతో వాటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 60 శాతం సొమ్ము పక్కదారి ... రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత జిల్లా కృష్ణాలో అగ్రిమెంట్ విలువలో 40 శాతానికి మించి పనులు జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన 60 శాతం సొమ్ము ప్రజాప్రతినిధులు, నేతలకు కమీషన్ల రూపంలో ముడుతోంది. టెండర్ పొందిన నిర్మాణ సంస్థ పనులను ప్రారంభించాలంటే ముందుగా జల వనరుల శాఖ మంత్రి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాలి. వారి అనుచరులకు సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులను అప్పగించాలి. ఆ తరువాతే మిగిలిన పనిని చేపట్టాల్సి ఉంటుంది. నూజివీడు నియోజకవర్గ పరిధిలో రూ.186 కోట్లతో కాల్వల మరమ్మతులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటిలో అధిక శాతం పనులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సబ్ కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. సాగర్ ఎడమ కాలువకు గన్నవరం మండలం చిట్టచివరి ప్రాంతం. 40 సంవత్సరాల క్రితం తమ ప్రాంతానికి సాగర్ నీరు రావడం చూశామని అక్కడి పెద్దలు చెబుతున్నారు. నీటి విడుదల లేకపోవడంతో కాల్వలు పక్కనున్న పొలాల్లో కలిసిపోయాయి. కాల్వలు లేకపోయినా ప్రభుత్వం మరమ్మతుల పేరిట నిధులు వృథా చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
ఏం మాయ చేశారో..!
కనిపించని తోటపల్లి ఎంబుక్‌లు సీఎం పర్యటన దగ్గర పడుతుండడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు సబ్ కాంట్రాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు బొబ్బిలి: వచ్చే నెలలో తోటపల్లి జలాశయం ద్వారా ఆయకట్టుకు ముఖ్యమంత్రితో నీరు విడుదల చేస్తామన్న దగ్గర నుంచి నీటిపారుదలశాఖాధికారులకు నిద్ర పట్టడం లేదు. పనులు జరుగుతున్నా అందుకు సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి తోటపల్లి జలాశయం ప్రధాన కాలువ నిర్మాణానికి సంబంధించిన మెజర్మెంట్ పుస్తకాలు (ఎంబుక్)లు మాయమయ్యాయి. దీంతో నీటిపారుదల శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ ఎంబుక్‌లను తన దగ్గరుంచుకున్న సబ్ కాంట్రాక్టరుపై తోటపల్లి జలాశయం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మన్మథరావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట బొబ్బిలి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలంలో మొదలైన తోటపల్లి కుడి ప్రధాన కాలువ శ్రీకాకుళం జిల్లా రాజాం వరకూ దాదాపు 117 కిలోమీటర్ల పొడవుంది. ఈ కాలువల పనులు చేయడానికి ప్రభుత్వం రూ.109 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన యుఎన్‌మాక్స్ కంపెనీ ఆన్లైన్లో దక్కించుకుంది. వారు పూర్తి స్థాయిలో పనులు చేయకముందే హైదరాబాద్‌కు చెందిన శ్రీరామా కనస్ట్రక్షను కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కంపెనీ వారే పనులు చేస్తున్నారు. ఈ సబ్ కాంట్రాక్టరు కొంత కాలంగా బొబ్బిలి మునిసిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ నుంచి నిర్మాణ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టరు చేస్తున్న పనుల్లోనే గత ఏడాది హుద్‌హుద్ సమయంలో సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నది వద్ద కట్టిన ఆక్విడెక్టుకు భారీ గండిపడింది. దానికి పూర్తిస్థాయిలో పనులు జరగకముందే మళ్లీ ఈ నెలలో ట్రయల్ రన్‌కు నీరు వదిలితే ఆ నీటి ప్రవాహానికి మళ్లీ భారీ గండి పడింది. అలాగే బాడంగి మండలం పాల్తేరు గ్రామం వద్ద ఆక్విడెక్టుకు కూడా లీకులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒకవైపు ఇలా ఉంటే మరో వైపు సీఎం చంద్రబాబు ఆగస్టు 15న నీటిని విడుదల చేయడానికి ముహుర్తాన్ని నిర్ణయించేశారు. దాంతో ఇప్పుడు అసంపూర్తిగా ఉండిపొయినవి, గండ్లు పడినవి, బలహీనంగా ఉన్న కాలువలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ సమయంలో జరిగిపోయిన పనులకు బిల్లు లు చెల్లించడానికి సిద్ధమయ్యేసరికి ఎంబుక్‌లు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. మొద ట ఒప్పందం చేసుకున్న సంస్థకు సమాచారం అందించారు. అయితే ఎంబుక్‌లన్నీ సబ్ కాంట్రాక్టరు వద్దే ఉన్నాయని వారు చెప్పడంతో అవి రాబట్టడానికి ప్రయత్నాలు చేశారు. అవి ఫలించకపోవడంతో పొలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగు ప్రొక్రూర్‌మెంటు కాం ట్రాక్ట్(ఈపీసీ) విధానంలో పనులు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ల వద్దే ఎంబుక్‌లు ఉంటాయి. కాంట్రాక్టరు ఎప్పుడు పనులు చేస్తే అప్పుడు వాటిని అధికారులు పరి శీలన జరిపి బిల్లులు ఇస్తారు. ఇప్పటివరకూ సక్రమంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుంటే ఇప్పుడు ఎంబుక్‌లు మాయం అవడం వెనుక జరుగుతున్న వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య విభేదాల కారణంగా ఇలా జరిగిందా అనే సందేహం తలెత్తుతోంది. మరో 20 రోజుల్లో సీఎంతో ప్రారంభోత్సవం పెట్టుకుని ఇప్పుడు ఇంకా బిల్లులు ఇవ్వకపోవడం, ఎంబుక్‌లు కనిపించకపోవడం వంటివి జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో చివరకు బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే గొల్లపల్లిలో ఉన్న సబ్ కాంట్రాక్టరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
సబ్ కాంట్రాక్టర్లు ఇకపై కాంట్రాక్టర్లు
గుర్తింపు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారిని కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, రహదారుల పనులు చేపడుతున్నందున సబ్ కాంట్రాక్టర్లను, కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజనీర్ల బోర్డు (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్) ప్రభుత్వానికి గతంలో సిఫార్సుచేసింది. క్లిష్టమైన కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించడంతో పాటు తెలంగాణకు చెందిన సబ్ కాంట్రాక్టర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సబ్ కాంట్రాక్టర్లు నేరుగా టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా, గతంలోని జీవోలను మార్పు చేయాల్సి ఉందని, గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాదైనా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక తరగతి కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత కల్పించాలని బోర్డు సూచించింది. స్థానిక సంస్థల పరిధిలో నిర్మాణ రంగంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్లకు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అర్హత కల్పించాలని సిఫార్సు చేసింది. సీఎంను కలసిన సబ్ కాంట్రాక్టర్ల బృందం.. సోమవారం సబ్ కాంట్రాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో రావాల్సిన బకాయిలు, తమను కాంట్రాక్టర్లుగా గుర్తించే విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు విశ్వరాజ్పాల్, ఇతర నాయకులు హరినాథ్, శ్రీనాథ్, గౌతమ్‌రెడ్డి తదితరులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల వరకు టెండర్ వేసేందుకు ఉన్న అర్హతను రూ.10 కోట్లకు పెంచేందుకు సీఎం సానుకూలత తెలిపినట్లు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.