- గుర్తింపు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారిని కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, రహదారుల పనులు చేపడుతున్నందున సబ్ కాంట్రాక్టర్లను, కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజనీర్ల బోర్డు (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్) ప్రభుత్వానికి గతంలో సిఫార్సుచేసింది.
క్లిష్టమైన కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించడంతో పాటు తెలంగాణకు చెందిన సబ్ కాంట్రాక్టర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సబ్ కాంట్రాక్టర్లు నేరుగా టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా, గతంలోని జీవోలను మార్పు చేయాల్సి ఉందని, గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాదైనా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక తరగతి కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత కల్పించాలని బోర్డు సూచించింది. స్థానిక సంస్థల పరిధిలో నిర్మాణ రంగంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్లకు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అర్హత కల్పించాలని సిఫార్సు చేసింది.
సీఎంను కలసిన సబ్ కాంట్రాక్టర్ల బృందం..
సోమవారం సబ్ కాంట్రాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో రావాల్సిన బకాయిలు, తమను కాంట్రాక్టర్లుగా గుర్తించే విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు విశ్వరాజ్‌పాల్, ఇతర నాయకులు హరినాథ్, శ్రీనాథ్, గౌతమ్‌రెడ్డి తదితరులు సీఎంకు వివరించారు.
దీనిపై స్పందించిన సీఎం వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల వరకు టెండర్ వేసేందుకు ఉన్న అర్హతను రూ.10 కోట్లకు పెంచేందుకు సీఎం సానుకూలత తెలిపినట్లు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.