ఆస్తిపన్నులో 'గ్రేటర్' కట్!
హైదరాబాద్ : జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. పదిరోజుల్లోగా పనులు మొదలుపెట్టి నెలలోపు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు, మధ్య తరగతి వారికి ఆస్తిపన్ను తగ్గించే ప్రతిపాదనకు కేసీఆర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రూ.1200లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారికి రూ.101 వసూలు చేసే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం అమలు అయితే సుమారు 5 లక్షల మంది లబ్ది పొందనున్నారు. కాగా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ లబ్ది పొందేందుకు గ్రేటర్ వాసులకు వరాల జల్లు కురిపిస్తోంది.