రహదారులకు పెద్దపీట
ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
* ప్రతి ఊరికి కచ్చితంగా మంచి రోడ్డు ఉండాలి
* నిర్మాణాలు భవిష్యత్ తరాలు కూడా ఉపయోగించుకునే ఉండాలి
* ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయాలు నిర్మించండి
* సకాలంలో పనులు పూర్తి చేసే ఏజెన్సీలకు 1.5 శాతం పారితోషికం
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టే నిర్మాణాలు ప్రజల అవసరాలకు తగినట్లుగా శాశ్వత ప్రాతిపదికన, భవిష్యత్ తరాలు కూడా ఉపయోగించుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఆర్ అండ్ బీ ద్వారా చేపట్టే రహదారుల నిర్మాణం ఉందని చెప్పారు. ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఏ సంవత్సరం ఎంత మేర పని అవుతుందో ముందే అంచనా వేసుకుని పక్కాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. నిర్మాణాల్లో జాప్యం నివారించాలని, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసే ఏజెన్సీలకు 1.5 శాతం పారితోషికంగా ఇవ్వాలని సూచించారు. బడ్జెట్ సమీక్షలో భాగంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖపై సీఎం పునఃసమీక్ష జరిపారు.
ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లేన్ల రోడ్లు, ప్రతీ గ్రామానికి కచ్చితంగా మంచి రహదారి ఉండేలా విధానపర నిర్ణయం తీసుకున్నందున ఆ రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నదులు, ఉప నదులు, కాల్వలపై నిర్మించే బ్రిడ్జిలకు నిధులు కేటాయించే సమయంలో ఏ సంవత్సరంలో ఎంత పని జరుగుతుందో అంచనా వేసి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.
వారంలో రెండోసారి
ఆర్‌అండ్‌బీ విభాగం బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ వారంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సమీక్ష జరపడం గమనార్హం. తొలి సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.6 వేల కోట్లకుపైగా ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. అయితే అంత మొత్తం కేటాయించటం కుదరదని, ఏడాదిలో చేపట్టే పనులకు సంబంధించిన వ్యయాన్ని పక్కాగా అంచనా వేసుకొని ప్రతిపాదనలను కుదించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అందుకే సవరించిన ప్రతిపాదనలపై మరోమారు సమీక్ష జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.