రోడ్డుపై గుంత కనిపిస్తే సస్పెన్షనే! | Kcr warns R&B officials on pits on roads | Sakshi
Sakshi News home page

గుంత కనిపిస్తే సస్పెన్షనే!

Published Tue, May 2 2017 1:25 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

రోడ్డుపై గుంత కనిపిస్తే సస్పెన్షనే! - Sakshi

రోడ్డుపై గుంత కనిపిస్తే సస్పెన్షనే!

ఆర్‌ అండ్‌ బీ అధికారులకు సీఎం హెచ్చరిక
- మే చివరినాటికి రోడ్లను బాగు చేయాలి
- జూన్‌ 1 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా
- రోడ్లన్నింటినీ స్వయంగా పరిశీలిస్తానని వెల్లడి
- చరిత్రలో ఎన్నడూ లేనట్టు నిధులిచ్చినా నిర్లక్ష్యమేమిటంటూ ఆగ్రహం
- రోడ్లపై సమీక్ష.. ఆ శాఖ తీరుపట్ల అసంతృప్తి
- హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి  


సాక్షి, హైదరాబాద్‌: చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, వాటితో రోడ్లను గొప్పగా తీర్చిదిద్దుతారనుకుంటే ఇంకా గుంతలు కనిపిస్తూనే ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోమని, జూన్‌ ఒకటో తేదీ తర్వాత ఎక్కడైనా రోడ్లపై గుంత కనిపిస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. మే చివరినాటికి రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్‌ ఒకటి తర్వాత తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, రోడ్లపై గుంతలు తన దృష్టికి వస్తే  ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

సోమవారం ప్రగతిభవన్‌లో రోడ్ల అంశంపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, రామకృష్ణ, ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేనట్టుగా రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. కేంద్రాన్ని ఒప్పించి అనేక జాతీయ రహదారులను సాధించగలిగాం. కొత్త రహదారుల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మతులకు కూడా నిధులిచ్చాం. అయినా ఇంకా రహదారులపై గుంతలు ఎందుకు కనిపిస్తున్నాయి..?’’అని కేసీఆర్‌ ప్రశ్నించారు.


ఎందుకీ నిర్లక్ష్యం..?
రోడ్లపై గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారు. వరంగల్‌ జిల్లాలో పర్యటన సమయంలో వరంగల్‌ నుంచి పాలకుర్తి వరకు రోడ్డు మార్గంలో వెళ్లినప్పడు తనకు ఎన్నో గుంతలు కనిపించాయన్నారు. రోడ్లపై గుంతలు ఉండవద్దని, ఎప్పటికప్పుడు వాటిని పూడ్చేయాలని గతంలోనే స్పష్టంగా చెప్పినా.. అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా పంచాయతీరాజ్‌ రోడ్లను ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి.. ఆర్‌ అండ్‌ బీ రహదారులను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తున్నారని చెప్పారు.

ఇలా శాఖ మారిన సందర్భంలో కొత్త రోడ్డు నిర్మించడానికి కొంత సమయం పడుతుందని, ఆలోగా గుంతలు పడినా, కొట్టుకుపోయినా మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేస్తున్నారని మండిపడ్డారు. రహదారి పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పనిచేయకుంటే కూడా రహదారి అలాగే ఉండిపోతోందని... దాంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలని, మరమ్మతులు నిరంతరం కొనసాగాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌ ఘనపూర్‌–పాలకుర్తి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పెర్కిట్‌–జగిత్యాల మధ్య నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలని... దానివల్ల నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు నాలుగులేన్ల రహదారి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.


ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలు
కొత్త జిల్లా కార్యాలయాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించి, డిజైన్లు కూడా ఆమోదించినందున ఏడాదిలోగా వాటి పనులు పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణాన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలను విభజించామని.. సంబంధిత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తేనే పాలన చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఉద్యోగాల భర్తీ చేపడతాం..
పనిభారం పెరిగిన శాఖల్లో ఉన్నతోద్యోగుల అవసరం పెరుగుతోందని... రోడ్లు, భవనాలు, నీటి పారుదల తదితర శాఖల్లో ఈఎన్‌సీలు సహా ఉన్నతాధికారుల సంఖ్య పెంచుకోవాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనందున అధికారుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకే పదవీ విరమణ పొందిన కొందరి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నామని చెప్పారు. అలాంటి సందర్భంలో పదోన్నతి పొందాల్సిన వారికి అన్యాయం జరుగుతుందని, అందువల్ల పోలీసు శాఖ మాదిరిగా అదనపు పోస్టులు సృష్టించాలని పేర్కొన్నారు. పదోన్నతులు క్రమం తప్పకుండా అందాలని, కొత్తగా సృష్టించిన పోస్టుల్లో పదోన్నతి ద్వారా వచ్చిన వారిని నియమిస్తే.. ఎవరికీ అన్యాయం జరగదని సూచించారు.

హైదరాబాద్‌లో వరంగల్, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగినందున అవసరమైన ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం గడ్కరీతో ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్‌ మార్గంలో ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 6.4 కిలోమీటర్ల మేర కారిడార్‌కు రూ.950 కోట్లు, బెంగళూరు మార్గంలో ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వరకు రూ.290 కోట్లు, విజయవాడ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సర్వీసు రోడ్డు (యుటిలిటీ కారిడార్‌) నిర్మాణానికి రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

ఉప్పల్‌–ఘట్‌కేసర్‌ మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉన్నందున 6.4 కిలోమీటర్లు పోను మిగతా పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. మొత్తం ప్రతిపాదిత పనుల విలువ రూ.1,410 కోట్లు అవుతుందని తెలిపారు. కేసీఆర్‌ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో గడ్కరీని కలిసి వినతిపత్రాలు, అంచనాల వివరాలు సమర్పించాల్సిందిగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement