ఏం మాయ చేశారో..! | Sub-contractors complain to police | Sakshi
Sakshi News home page

ఏం మాయ చేశారో..!

Published Tue, Jul 28 2015 1:08 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Sub-contractors complain to police

కనిపించని తోటపల్లి ఎంబుక్‌లు
 సీఎం పర్యటన దగ్గర పడుతుండడంతో
 తలలు పట్టుకుంటున్న అధికారులు  
 సబ్ కాంట్రాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
 
 బొబ్బిలి: వచ్చే నెలలో తోటపల్లి జలాశయం ద్వారా ఆయకట్టుకు ముఖ్యమంత్రితో నీరు విడుదల చేస్తామన్న దగ్గర నుంచి నీటిపారుదలశాఖాధికారులకు నిద్ర పట్టడం లేదు. పనులు జరుగుతున్నా అందుకు సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి  తోటపల్లి జలాశయం ప్రధాన కాలువ నిర్మాణానికి సంబంధించిన మెజర్మెంట్ పుస్తకాలు (ఎంబుక్)లు మాయమయ్యాయి. దీంతో  నీటిపారుదల శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
  ఇప్పటివరకూ ఎంబుక్‌లను తన దగ్గరుంచుకున్న సబ్ కాంట్రాక్టరుపై తోటపల్లి జలాశయం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మన్మథరావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  రెండు రోజుల కిందట బొబ్బిలి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలంలో మొదలైన తోటపల్లి కుడి ప్రధాన కాలువ శ్రీకాకుళం జిల్లా రాజాం వరకూ దాదాపు 117 కిలోమీటర్ల పొడవుంది. ఈ కాలువల పనులు చేయడానికి  ప్రభుత్వం రూ.109 కోట్లతో టెండర్లు పిలిచింది.  ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన యుఎన్‌మాక్స్ కంపెనీ  ఆన్‌లైన్‌లో దక్కించుకుంది.
 
 వారు పూర్తి స్థాయిలో పనులు చేయకముందే హైదరాబాద్‌కు చెందిన శ్రీరామా కనస్ట్రక్షను కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కంపెనీ వారే పనులు చేస్తున్నారు. ఈ సబ్ కాంట్రాక్టరు కొంత కాలంగా బొబ్బిలి మునిసిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ నుంచి నిర్మాణ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టరు చేస్తున్న పనుల్లోనే గత ఏడాది హుద్‌హుద్ సమయంలో సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నది వద్ద కట్టిన ఆక్విడెక్టుకు భారీ గండిపడింది. దానికి పూర్తిస్థాయిలో పనులు జరగకముందే మళ్లీ ఈ నెలలో ట్రయల్ రన్‌కు నీరు వదిలితే ఆ నీటి ప్రవాహానికి మళ్లీ భారీ గండి పడింది. అలాగే బాడంగి మండలం పాల్తేరు గ్రామం వద్ద ఆక్విడెక్టుకు కూడా లీకులు ఏర్పడ్డాయి.
 
 ఇవన్నీ ఒకవైపు ఇలా ఉంటే మరో వైపు సీఎం చంద్రబాబు ఆగస్టు 15న నీటిని విడుదల చేయడానికి ముహుర్తాన్ని నిర్ణయించేశారు. దాంతో ఇప్పుడు అసంపూర్తిగా ఉండిపొయినవి, గండ్లు పడినవి, బలహీనంగా ఉన్న కాలువలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ సమయంలో జరిగిపోయిన పనులకు బిల్లు లు చెల్లించడానికి సిద్ధమయ్యేసరికి ఎంబుక్‌లు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. మొద ట ఒప్పందం చేసుకున్న సంస్థకు సమాచారం అందించారు. అయితే ఎంబుక్‌లన్నీ సబ్ కాంట్రాక్టరు వద్దే ఉన్నాయని వారు చెప్పడంతో అవి రాబట్టడానికి ప్రయత్నాలు చేశారు. అవి ఫలించకపోవడంతో పొలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగు ప్రొక్రూర్‌మెంటు కాం ట్రాక్ట్(ఈపీసీ) విధానంలో పనులు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ల వద్దే ఎంబుక్‌లు ఉంటాయి. కాంట్రాక్టరు ఎప్పుడు పనులు చేస్తే అప్పుడు వాటిని అధికారులు పరి శీలన జరిపి బిల్లులు ఇస్తారు.
 
 ఇప్పటివరకూ సక్రమంగా  బిల్లుల చెల్లింపులు జరుగుతుంటే  ఇప్పుడు ఎంబుక్‌లు మాయం అవడం వెనుక జరుగుతున్న వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య విభేదాల కారణంగా ఇలా జరిగిందా అనే సందేహం తలెత్తుతోంది. మరో 20 రోజుల్లో సీఎంతో ప్రారంభోత్సవం పెట్టుకుని ఇప్పుడు ఇంకా బిల్లులు ఇవ్వకపోవడం, ఎంబుక్‌లు కనిపించకపోవడం వంటివి జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో చివరకు బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే గొల్లపల్లిలో ఉన్న  సబ్ కాంట్రాక్టరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement