వదల బొమ్మాళీ..!
►పట్టు విడువని టీడీపీ ముఖ్య నేత
►ఎన్‌ఎస్‌పీ స్థలం కోసం వేగంగా కదులుతున్న పావులు
►క్వాలిటీ కంట్రోల్‌ను అడ్డుపెట్టి నివేదిక
►లూజ్ సాయిల్ అంటూ నివేదిక ఇప్పించే యత్నం
►ఎన్‌ఎస్‌పీ భవన నిర్మాణానికి స్థలం పనికిరాదంటూ కొత్త వాదన
►ఎస్‌ఈ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆపే ఎత్తుగడ
►ఇరిగేషన్ మంత్రిని అడ్డుపెట్టి పనులు నిలిపివేత
►99 ఏళ్ల లీజుకు స్థల స్వాధీనానికి యత్నం
ఒంగోలు: ఇరిగేషన్ ఎస్‌ఈ శారదను పట్టుపట్టి బదిలీ చేయించిన టీడీపీ జిల్లా ముఖ్యనేత అంతే పట్టుదలతో 1.92 ఎకరాల ఎన్‌ఎస్‌పీ(నాగార్జున సాగర్ ప్రాజెక్టు) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ స్థలం భవన నిర్మాణానికి పనికి రాదంటూ ఇరిగేషన్ క్వాలిటీ విభాగం ద్వారా నివేదిక ఇచ్చే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎన్‌ఎస్‌పీ సర్కిల్ కార్యాలయ పనులను బుధవారం ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు పరిశీలించారు. ఇరిగేషన్ మంత్రి ద్వారా భవన నిర్మాణ పనులను ఆపేందుకు సర్వం సిద్ధం చేశారు. 99 సంవత్సరాల లీజుకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
99 సంవత్సరాల లీజుకు స్థలం కావాలంటూ ఇరిగేషన్ మంత్రికి ఇప్పటికే ప్రతిపాదనలిచ్చిన అధికార పార్టీ నేత త్వరగా స్థలాన్ని స్వాధీనం చేయాలంటూ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే నీటిపారుదల శాఖ రూ.5 కోట్ల నిధులతో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టింది. రెండు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుతం పునాదుల దశలో ఉంది. భవన నిర్మాణ పనులు ఆగితేనే 1.92 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసేందుకు వీలవుతుందని అధికార పార్టీ నేతకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా టీడీపీ నేత తక్షణం భవన నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఇరిగేషన్ సీఈతో పాటు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. మరోవైపు సాంకేతికంగా సాకు చూపి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సదరు నేత సిద్ధమయ్యారు.
ప్రస్తుతం సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం బ్లాక్ సాయిల్(నల్లనేల) ఉందని, ఇది భవన నిర్మాణానికి అనుకూలత లేదని క్వాలిటీ కంట్రోల్ ద్వారా నివేదిక ఇప్పించేందుకు వ్యూహం పన్నారు. భవన నిర్మాణానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ, ఇరిగేషన్) డిజైన్ ఇచ్చింది. వారు సూచించిన మేరకు 2.6 మీటర్ల లోతు పునాదులు తీయాలి. బ్లాక్ సాయిల్ కావడంతో ఈ లెక్కన 7.5 టన్ను ఫర్ స్కైర్‌ఫీట్ సామర్థ్యం మాత్రమే కలిగి ఉందని ఈ మేరకు సీడీఓ డిజైన్ రూపొందించి ఇచ్చింది. వాస్తవంగా మొరం, సుద్ధ లాంటి సాయిల్ అయితే 15 నుంచి 20 టన్ను ఫర్ స్కైర్‌ఫీట్ సామర్థ్యం ఉంటుంది. దీంతో పోలిస్తే ప్రస్తుతం భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం బ్లాక్ లూజ్ సాయిల్ కావడంతో తక్కువ సామర్థ్యం ఉన్నట్లే అని అధికారుల వాదన. పైన కనబరిచిన టెక్నికల్ కారణాన్ని చూపి భవన నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా లేదని తేల్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే నివేదికను సాకుగా చూపి ఇరిగేషన్ మంత్రి ద్వారా ఒత్తిడి తెచ్చి తొలుత భవన నిర్మాణాన్ని ఆపించాలని టీడీపీ జిల్లా నేత ప్రణాళిక సిద్ధం చేశారు.
పరిసరాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు..
వాస్తవానికి ఇదే ప్రాంతంలో ప్రగతి భవన్, నాగార్జున యూనివర్సిటీకి చెందిన భవనాలతో పాటు సమీపంలోనే 8 అంతస్తులు నిర్మించిన అపార్టుమెంట్లు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ భవనాలతో పాటు కుప్పలుతెప్పలుగా వెలిశాయి. వాటికి వర్తించని లూజ్ సాయిల్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ భవనానికి ఎలా వర్తిస్తున్నందే ప్రశ్న. ఇదే విషయాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం పేర్కొనడం గమనార్హం. ఇక టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసమే స్థంల అడుగుతున్నట్లు జిల్లా ముఖ్యనేత చెబుతున్నా విషయం తెలిసిందే. అదే జరిగితే ఎస్‌ఈ కార్యాలయ భవన నిర్మాణానికి అనువుగా లేని స్థలం టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎలా అనువుగా ఉంటుందన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది.
ఈ లెక్కన నిజంగానే ’25 కోట్ల విలువైన ఈ స్థలం టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యనేత అడుగుతున్నారా...? లేక 99 సంవత్సరాల లీజుకు స్థలాన్ని కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక పక్క ప్రధానమైన నీటిపారుదల శాఖకు సొంత భవనాలు కూడా లేక అధికారులు ఇబ్బందులు పడుతుంటే విలువైన శాఖ స్థలాన్ని వారి భవన నిర్మాణం కోసం కాకుండా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం అధికార పార్టీ నేత ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ సాక్షాత్తు ఇరిగేషన్ ఎస్‌ఈ శారదను పట్టుపట్టి బదిలీ చేయించడంపై ఆ శాఖ అధికారులతో పాటు అధికార టీడీపీ వర్గాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా... కలెక్టర్ మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. విలువైన ప్రభుత్వ స్థలం పార్టీ కార్యాలయం పేరుతో కొట్టేసేందుకు టీడీపీ నేత సిద్ధమవుతున్నా జిల్లా పాలనాధికారి పట్టించుకోకపోవడం బాధాకరమన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది.