కోటి ఎకరాలకు నీరందాల్సిందే
* నిధులకు ఫికర్ లేదన్న కేసీఆర్
* మధ్యలో ఉన్నవన్నీ 15 నెలల్లో పూర్తికావాలి
* ఏం చేద్దామో ప్రతిపాదనలివ్వండి
* రిటైర్డ్, ప్రస్తుత సాగునీటి ఇంజనీర్లతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోగా తెలంగాణ రాష్ట్రం లోని కోటి ఎకరాలకు సాగునీరు అందాల్సిందేనని, నిధులకోసం ఫికర్ వద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్నవి, కొత్తగా అవసరమైన ప్రాజెక్టుల ప్రతిపాదనల గురించి సాగునీటి అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
సాగునీటి శాఖలో అమలులో ఉన్న మార్గదర్శకాలు, సమస్యలు, మార్పు చేర్పులు చేయాల్సిన అంశాలపై స్థూలంగా చర్చించారు. ప్రభుత్వానికి ఐదేళ్ల కాలపరిమితి ఉన్నా, తెలంగాణలో ఇప్పటిదాకా అనుకున్న కోటి ఎకరాలకు సాగునీటిని 50 నెలల్లోగా పూర్తిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం సాగునీరు అని కేసీఆర్ ప్రకటించారు.
‘ప్రాజెక్టులను పూర్తిచేయడానికి నిధుల లభ్యత గురించి మీరు ఆలోచించొద్దు. నిధులను సమీకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ప్రపంచబ్యాంకు నుంచి తెస్తామా, అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తెస్తామా, కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తామా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. నిధులను ఎలాగైనా సమీకరిస్తా. ఆ బాధ్యత నాది. వీలైనంత వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యత మీది. సాగునీటి శాఖలో ఇప్పుడున్న సమస్యలు, చేయాల్సిన మార్పులు, సగం పూర్తయిన ప్రాజెక్టులు, వెంటనే చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రతిపాదనలు, సూచనలు చేయండి’ అని కేసీఆర్ కోరారు.
సాగునీటి శాఖలోని ఉద్యోగుల బదిలీలు సచివాలయం వరకు రాకుండా ఎక్కడికక్కడే ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే ఉండేవిధంగా సాగునీటిశాఖను సమూలంగా మారుస్తానని చెప్పారు. మంత్రికి అన్ని అధికారాలు ఉంటాయని, కిందిస్థాయి అధికారాలను వికేంద్రీకరించే విధంగా మార్గదర్శకాలను మారుస్తామని చెప్పారు. సంస్థాగతంగా, సాంకేతికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన సంస్కరణల గురించి స్థూలంగా చర్చించారు. సగంలో ఉన్నవి, 80 శాతం దాకా పూర్తయిన 26 తెలంగాణ ప్రాజెక్టులకు 14 వేల కోట్లు అవసరమవుతాయని సాగునీటి శాఖాధికారులు నివేదికను ఇచ్చారు. వీటివల్ల 24 లక్షల ఎకరాలు తక్షణమే సాగుకు వస్తాయని అధికారులు నివేదించారు.
50 నెలల్లోనే లక్ష్యం చేరాలి
ప్రభుత్వానికి 60 నెలల గడువున్నా, కోటి ఎకరాల లక్ష్యాన్ని 50 నెలల్లోనే చేరాలని కేసీఆర్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, క్రమం తప్పని సమీక్షలతో వీలైనంత వేగంగా పనులు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు ఉన్న పూర్వవైభవాన్ని తీసుకురావాలన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో తక్షణమే ఉత్పన్నమయ్యే ఖాళీలు, వాటిలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు జాబితా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఖాళీల్లో కొత్తవారిని తీసుకుంటామని, అప్పటిదాకా పనులను ఆపడానికి వీల్లేదన్నారు. అందుకే అనుభవం ఉన్న ఇంజనీర్లు ఆసక్తిగా ఉంటే వెంటనే నియమించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలను ఇస్తుందని కేసీఆర్ ప్రకటించారు.
తక్షణమే కొన్ని.. దీర్ఘకాలికం మరికొన్ని
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ విముక్తానికి డిండి ఎత్తిపోతల పథకం, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమీ, కోయిల్కుంట్ల వంటివి వెంటనే పూర్తిచేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామన్నారు. జిల్లాల వారీగా మధ్యలో ఉన్నవాటిని తక్షణమే పూర్తిచేసుకుందామన్నారు. జిల్లాలవారీగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో మధ్యలో ఆగిపోయినవి, కొత్తగా చేపట్టాల్సిన వాటి గురించి కేసీఆర్ చర్చించారు.
కేబినెట్లో చర్చించిన తర్వాతనే ప్రకటన
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత కేబినెట్ సమావేశంలో జరిగే నిర్ణయాల తర్వాతనే సాగునీటి రంగంలో విధాన ప్రకటన చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాజకీయ అవినీతి జీరో స్థాయిలో ఉండాలని, అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం తర్వాతనే జిల్లాల వారీగా ప్రాధాన్యతలు, ఇతర అంశాలపై నిర్దిష్టంగా ప్రకటన ఉంటుందన్నారు.
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
సమైక్య రాష్ట్రంలో 1956లో తెలంగాణ విలీనం అయ్యేనాటికి తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు, కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడది 3 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. తెలంగాణలోని 33 వేల చెరువుల్లో చాలావరకు కనుమరుగైనాయని, మిగిలినవాటికి గొలుసులు లేకుండాపోయి ఎండిపోతున్నాయని వివరించారు. వాటిని పునరుద్ధరించుకుని, చిన్ననీటి వనరులను భారీ నీటిపారుదల రంగంగా తెలంగాణలో వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.
చెరువులను, కుంటలను నింపుకోవడానికి కృష్ణా నది ద్వారా 90 టీఎంసీలు, గోదావరి ద్వారా 112 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినా 30-40 టీఎంసీలను వీటికి ఉపయోగించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌తో పాటు ఇంజనీర్లు ఆర్.విద్యాసాగర్‌రావు, శ్యాంప్రసాద్ రెడ్డి, పత్తి మోహన్ రెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, రామకృష్ణా రెడ్డి, వై.వి.చారి, రామానుజం, పి.వి.మధుసూదన్ రెడ్డి, వివిధ ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.