సర్వం పరమేశ్వరుడే
జగ్గంపేట :
సర్వం పరమేశ్వరుడని ఈశ్వర ప్రతిష్ఠాపన సందర్భంగా వర్షం పడడం శుభసూచకమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ అన్నారు. ఇర్రిపాక గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం ఘనంగా జరిగింది. ఉదయం 11.22 గంటలకు స్వరూపానంద స్వామిజీ శివాలయంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠకు నవధాన్యాలు వేసి పూజచేసి యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కాశీలో లింగ ప్రతిష్ఠకు వెళ్లాల్సి ఉందని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆహ్వానంతో ఇర్రిపాక వచ్చానన్నారు. స్వామిజీకి అన్నవరం వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం ఆయన కాశీ వెళ్లేందుకు బయలుదేరారు. ఎమ్మెల్యే నెహ్రూ, మణి దంపతులు, వారి కుమారుడు జెడ్పీటీసీ సభ్యుడు నవీన్ దంపతులు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.