విశాఖ లో విజయ వీచిక
ఎన్నికలంటే పోటీ అనివార్యం. అందునా విశాఖపట్నం వంటి ప్రతిష్టాత్మక స్థానంలో సహజంగానే ఆసక్తికరమైన పోరు సాగుతుంది. కానీ... ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తీరంలో ‘విజయ’ వీచికలు ముందే వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులూ భావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో పోరు ఏకపక్షమైంది. విజయమ్మ రాకతో విశాఖ జిల్లాలోనే కాక, ఉత్తరాంధ్రలోనూ వైఎస్సార్ సీపీకి సరికొత్త ఉత్తేజం వచ్చింది.
విశాఖ లోక్‌సభ స్థానంలో సార్వత్రిక ఎన్నికల పోరు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. వైఎస్ సతీమణిగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ‘మా ఇంటి ఆడపడచు’ అంటూ ఆదరిస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ..బీజేపీకి అప్పగించింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణ, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున సబ్బం హరి బరిలోకి దిగినా... కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు.
జోరుగా వీస్తున్న ‘ఫ్యాన్’ గాలి
వైఎస్ పట్ల విశాఖ ప్రజలకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆయనకూ విశాఖ అంటే ఎంతో ఇష్టం. విజయమ్మ కూడా ఇదే మాట చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టో కూడా విశాఖపై ఆ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని చాటింది. మేనిఫెస్టోలో ప్రకటించిన మెట్రో రైలు, కాలుష్యం నుంచి విముక్తి, ఈ ప్రాంతానికి ఉపయోగపడే రీతిలో పెట్రో యూనివర్సిటీ లాంటి అంశాలపై ఇప్పటికే ప్రజల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారెందరో ఇక్కడ ఉన్నారు. విజయమ్మ లాంటి ప్రముఖ నాయకురాలు ఎంపీగా ఎన్నికైతే విశాఖ రూపురేఖలు మారిపోతాయని, మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా అమలుచేసి.. మేలు చేస్తారని ఇక్కడి ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకూ ఎవరికీ రాని మెజారిటీతో ఆమెను గెలిపించాలన్న పట్టుదల వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కన్పిస్తోంది. విశాఖపై స్పష్టమైన ఆలోచనతో ఉన్న విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ఇందుకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
కళ తప్పిన ‘కమలం’
బీజేపీ అభ్యర్థి హరిబాబు రేసులో వెనుకబడ్డారు. ఆ పార్టీ ఇక్కడ గతంలో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. 1981లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలలో అత్యధిక డివిజన్లలో గెలుపొంది.. విశాఖ మేయర్ పదవినీ చేపట్టింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సీటును పట్టుబట్టి ఇప్పించుకుంది. ఈ స్థానంలో ఎలాగూ గెలవలేమని భావించిన టీడీపీ... ఈ సీటును బీజేపీకి అప్పజెప్పడానికి పెద్దగా అభ్యంతరాలు తెలపలేదు. దీంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. బీజేపీ ప్రచారంలో వారు పాల్గొనడం లేదు. హరిబాబు నామినేషన్ కార్యక్రమానికి కూడా కనీస స్థాయిలో హాజరుకాకపోవడం ఇందుకు నిదర్శనం. అటుపక్క బలమైన అభ్యర్థి(విజయమ్మ) కావడంతో కమలనాథులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ‘తమ్ముళ్ల’కు తాయిలాలు ఇచ్చినా సరైన స్పందన కనిపించడం లేదు. ఇటీవల బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు నిర్వహించిన రోడ్‌షో వెలవెలబోయింది. హరిబాబు విషయానికొస్తే... ఈయన ఇటీవల పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.1999లో విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పనిచేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో బీజేపీ నగరంలో ప్రభావం చూపిన సందర్భాలు లేవు.
స్థానికేతరులకు పట్టం
విశాఖ ఓటర్లు విశాల దృక్పథాన్ని చాటుకుంటున్నారు. వివిధ సందర్భాల్లో ఇది రుజువైంది. స్థానికేతరులైనా పట్టం కడుతున్నారు. సమర్థ నేతలే ముఖ్యమని, స్థానికాంశం ఏమాత్రమూ సరికాదనే భావనతో తీర్పు ఇస్తున్నారు. పీవీజీరాజు(విజయనగరం), ఉమ(విజయనగరం), ఎంవీవీఎస్ మూర్తి(తూర్పు గోదావరి), కొమ్మూరి అప్పలస్వామి(విజయనగరం), టి.సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి(నెల్లూరు),దగ్గుబాటి పురందేశ్వరి(ప్రకాశం)లను గెలిపించడమే ఇందుకు తార్కాణం.
అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు
భీమిలి
వైఎస్సార్ సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(టీడీపీ)తో తలపడుతున్నారు. ఎన్నికకో నియోజకవర్గాన్ని మార్చడం.. టీడీపీ శ్రేణులు కలసి రాకపోవడం గంటాకు ప్రతికూలంగా పరిణమించాయి. దీనికితోడు టీడీపీ రెబల్ అభ్యర్థి అనితా సకురు ఆ పార్టీ ఓట్లను చీల్చనుండటం సైకిల్ శిబిరాన్ని కలవరపరుస్తోంది. స్థానికుడు కావడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి సానుకూలాంశం.
విశాఖ తూర్పు
ఈసారీ పాత అభ్యర్థులే తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రెండో స్థానంలో నిలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఈసారి వైఎస్సార్ సీపీ పక్షాన బరిలోకి దిగారు. పాత ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ)కు గట్టి సవాలు విసురుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత, వివిధ కేసుల్లో నిందితుడు కావడం, రాష్ట్ర విభజనకు టీడీపీ సహకరించడం వెలగపూడికి మైనస్ పాయింట్లు.
విశాఖ దక్షిణం
గత ఎన్నికల్లో త్రుటిలో విజయానికి దూరమైన కోలా గురువులు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నిల్చున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, వాసుపల్లి గణేష్‌కుమార్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గురువులు స్థానిక మత్స్యకార వర్గానికి చెందిన నేత. ఇక్కడ టీడీపీకి అంత పట్టులేకపోవడం... కాలుష్య అంశం వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉండటం ఆ పార్టీ అభ్యర్థికి లాభిస్తున్నాయి.
విశాఖ ఉత్తరం
వైఎస్సార్ సీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజును ఎదుర్కొంటున్నారు. బలమైన సామాజిక వర్గం, సేవాతత్పరుడిగా గుర్తింపు, ప్రత్యర్థికి టీడీపీ శ్రేణులు సహకరించకపోవడం... తదితర అంశాలు వెంకటరావుకు అనుకూలంగా మారాయి. ఇక్కడ కాంగ్రెస్ పోటీ నామమాత్రమే.
విశాఖ పశ్చిమం
వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడి రత్నాకర్, టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమైనా అన్ని వర్గాలనూ కలుపుకుని రత్నాకర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారనే ముద్ర గణబాబుకు మైనస్‌గా మారింది. తండ్రి దాడి వీరభద్రరావు ఎన్నికల అనుభవం, వైఎస్ సంక్షేమ పథకాలు, ప్రణాళికాయుతమైన ప్రచార వ్యూహం రత్నాకర్‌కు సానుకూల అంశాలుగా మారాయి.
గాజువాక
తిప్పల నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పల్లా శ్రీనివాస్(టీడీపీ)ను ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్‌కు పార్టీలో అసమ్మతి తలనొప్పిగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి కాంగ్రెస్, టీడీపీ టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడి అసమ్మతితో రగిలిపోతున్నారు. దీర్ఘకాలిక పరిచయాలు, కుటుంబ నేపథ్యం, వైఎస్ పథకాలు.. నాగిరెడ్డికి లాభిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
శృంగవరపుకోట
ఎస్.కోటగా పిలిచే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం జిల్లా పరిధిలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రొంగలి జగన్నాథం పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున కోళ్ల లలితకుమారి(తాజా మాజీ ఎమ్మెల్యే) మరోసారి బరిలోకి దిగారు. ఈమెపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ప్రచారంలో ప్రజల నుంచి విశేషాదరణ లభిస్తోంది.