హైట్ తగ్గడానికి దారి లేదే!
తమిళ సినిమాల్లో రాణిస్తే ఇతర చిత్ర పరిశ్రమలో ఆదరణ బలంగా ఉంటుంది. వర్ధమాన నటి ఇషారా నాయర్ కూడా ఇదే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో నటి అనుష్క తరువాత ఆ స్థాయి హైట్ (5.8 అడుగులు) గల నటి ఇషారా వెణ్‌మేగం చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళకుట్టి చదివిందంతా తమిళనాడులోనేనట. ఈ అమ్మడు నటించిన వెణ్‌మేగం, పప్పాళి, చదురంగవెట్టై చిత్రాలు ఇప్పటికే తెరపై కొచ్చాయి. ప్రస్తుతం అతి మేధావి, పప్పరప్పం చిత్రాలతో పాటు తెలుగులో ఒక్కసారి అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇషారతో చిట్‌చాట్.
చిత్ర రంగ పరిచయం గురించి?
నా కుటుంబానికి నచ్చని రంగం ఇది. నాకైతే చాలా ఇష్టం. అలాగని నటించాలని ఆలోచన లేదు. అందుకు సరైన పర్సనాలిటీ నాకు లేదనే భావనలో ఉండేదాన్ని. తమిళనాడులోని తిరుసెంగోడులోగల వివేకానంద కళాశాలలో చదువుతున్న సమయంలో బాహ్య ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతి ఏడాది కేరళలో జరిగే మిస్ కేరళ పోటీల్లో జయించిన వాళ్లను చూస్తుంటే వాళ్లకంటే నేనే అందంగా ఉన్నాననిపించేది. 2010లో సరదాగా నా రెండు ఫొటోగ్రాప్స్కు మిస్ కేరళ పోటీకి మెయిల్ పంపాను. అప్పుడు ఊహించని రీతిలో మిస్ కేరళ పోటీకి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నా హైటే నాకు శాపం అయ్యింది. ఫైనల్ వరకు వచ్చి రెండో స్థానానికి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాతే నటించాలనే ఆలోచన వచ్చింది. అయిష్టంగా అమ్మ సమ్మతించడంతో వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఆరంభిం చాను. ఆప్రకటనలు చూసే వెణ్‌మేగం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఆరంభంలోనే ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటించినట్లున్నారు. ఎలా సాధ్యం?
నటించడానికి ఏమంత అనుభవం కావాలి. అనుభవజ్ఞులైన దర్శకులు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. అలా ఒకసారి పది చిత్రాల్లో కూడా నటించగలను.
కేరళకుట్టి అయ్యుండి మలయాళ చిత్రాలు చేయడం లేదే?
తమిళంలో నటిం చిన రెండు చిత్రాలు హిట్ అయితే అప్పుడు మలయాళంలో అధిక పారితోషికం ఇస్తారు. ఇది వృత్తి సీక్రెట్.
మీ పొడవును మైనస్‌గా భావిస్తున్నారా?
ఈ విషయం కరెక్ట్‌గా చెప్పలేను గానీ అమ్మాయి హైట్ మనకు సెట్ కాదు అని కొన్ని అవకాశాలు మిస్ అయిన సందర్భాలున్నాయి. పొడవు తగ్గితే ఏదైనా ఎనర్జీ ఫుడ్ తీసుకుని పెరిగే ప్రయత్నం చేయవచ్చు. హైట్ తగ్గడానికి ఎలాంటి దారి లేదే.
ఎక్స్పోజింగ్ గురించి?
పప్పాళి చిత్రంలో 1980 నాటి అమ్మాయిగా నటించాను. ఇళయరాజ నేపథ్య గీతానికి నటించాను. అతి మేధావి చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా నటించాను. ఇప్పటికీ ఈ వైవిధ్యం చాలా?
ఎలాంటి పాత్రలను కోరుకుంటున్నారు?
అన్ని రకాల పాత్రలు పోషించాలని కోరుకుంటున్నాను. ఏడాదికి కనీసం పది చిత్రాల్లో నటించాలి. తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటూ కొందరు హీరోయిన్లు ఇంటర్వ్యూ ఇస్తుంటారే నేను అలాంటి ఇంటర్వ్యూ ఇచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నాను. అదే నా డ్రీమ్.