దర్శకత్వానికే ప్రాధాన్యత
స్వయంగా దర్శకత్వం వహించాలనుకునే సినిమాలను మాత్రమే నిర్మించాలనుకుంటానని, ఇతరులు తీసే వాటికి నిర్మాతగా వ్యవహరించడం ఇష్టముండబోదని విశాల్ భరద్వాజ్ అంటున్నాడు. ఇక నుంచి సినిమాలు తీయడం మానేసి, ఆ శక్తిని దర్శకత్వ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటానని చెప్పాడు. అభిషేక్ చౌబే తనకు సోదరుడు వంటివాడు కాబట్టే దేడ్ ఇష్కియా దర్శకత్వ బాధ్యతను అతడికి అప్పగించానని చెప్పాడు. విశాల్ 2002లో తొలిసారిగా తీసిన బాలల సినిమా మక్డీకి విమర్శల ప్రశంసలు దక్కాయి. తరువాత మక్బూల్, ఓంకార వంటి చిత్రాలు రూపొందించాడు. నో స్మోకింగ్, ఇష్కియా, ఏక్ థి దయాన్ సినిమాలను నిర్మించాడు కానీ వాటికి దర్శకత్వం మాత్రం వహించలేదు. ‘నా సోదరి వంటిదైన మేఘనా గుల్జార్ తీసే సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. నా మనసుకు అత్యంత ఇష్టమైన కథ అది’ అని వివరించాడు.
భావోద్వేగాలు, నాటకీయత ఎక్కువగా ఉండే సినిమాలను రూపొందిస్తూ సంజయ్ లీలాభన్సాలీ విజయాలు సాధించడంపై స్పందిస్తూ అలాంటి కథలపై అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టే వాటిని ఎంచుకుంటాడని చెప్పాడు. ‘నాకు నమ్మకం లేని కథలకు దర్శకత్వం వహించడం గానీ నిర్మించడం గానీ నాకు ఇష్టముండదు. సంజయ్‌కు రౌడీ రాథోడ్ కథ బాగా నచ్చింది కాబట్టే దానిని నిర్మించి దర్శకత్వం వహించాడు’ అని విశాల్ వివరించాడు. దర్శకుడిగా మారడానికి ముందు ఇతడు చాలా సినిమాలకు సంగీతం అందించాడు. మాచిస్, సత్య, చాచీ 420, గాడ్‌మదర్, మక్బూల్, ఓంకార, కమీనే, ఇష్కియా, 7 ఖూన్మాఫ్ వంటి సినిమాలకు విశాల్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. సంజయ్ కూడా తన సినిమాకు సంగీతం అందించాలని ఓసారి కోరినా అప్పట్లో తీరిక లేకపోవడంతో ఒప్పుకోలేకపోయానని విశాల్ భరద్వాజ్ వివరించాడు.