రెక్కీ
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. త్రిశూలం ఆర్మీ శిక్షణా కేంద్రం పరిసరాల్లో సంచరిస్తున్న యువకుడు ఉగ్రవాదేనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అతడు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. మదురైలో డమ్మీ బాంబులు చిక్కడం కలకలం రేపింది. దీంతో నిఘా పటిష్టం చేశారు. తనిఖీలు
ముమ్మరమయ్యాయి.
* పట్టుబడింది ఉగ్రవాదేనా?
* మదురైలో డమ్మీ బాంబులు
* తనిఖీలు ముమ్మరం
సాక్షి, చెన్నై: ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు రాష్ట్రంలో భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అదే సమయంలో బాంబు బూచీలు ఓ వైపు, అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడటం, ఐఎస్ఐ ఏజెంట్లు చిక్కడం మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. చెన్నైతోపాటుగా, ఆధ్యాత్మిక కేంద్రం మదురై తీవ్రవాదుల టార్గెట్‌లో ఉన్నట్టుగా తరచూ నిఘా వర్గాలు హెచ్చరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు. దీంతో తనిఖీల నిమిత్తం పోలీసులు రోడ్డెక్కారు.
కలకలం రేపిన బాంబులు: ఆధ్యాత్మిక కేంద్రంలో బాంబు బెదిరింపులు, అజ్ఞాత వ్యక్తులు సంచారం, హత్యానేరాల సంఖ్య పెరుగుతోంది. తరచూ పేలుడు పదార్థాలు సైతం పోలీసుల తనిఖీల్లో చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మదురై అన్నానగర్ పరిసరాల్లోని ఓ చెత్త కుండీలో బాంబులు కలకలం రేపాయి. చెత్త వేయడానికి వచ్చిన ఓ మహిళ ఆ బాంబుల్ని గుర్తించడంతో పోలీసులు ఉరకలు తీశారు. ఆ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్క్వా డ్లు 11 బాంబులు ఉన్నట్టు తేల్చాయి. వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. తొలుత అవినాటు బాంబులుగా తేల్చగా, పూర్తి స్థాయి పరిశీలతో అవి డమ్మీ బాంబులుగా నిర్ధారణకు వచ్చారు. ఇంతకీ ఈ బాంబులు అక్కడకు ఎలా వచ్చాయోనన్న విచారణను వేగవంతం చేశారు. నగరాన్ని తీవ్రవాదులు టార్గెట్ చేసి ఉండటంతో భద్రతను, తనిఖీలను ముమ్మరం చేశారు.
ఆర్మీ శిక్షణ కేంద్రంలోనే...: మీనంబాక్కం విమానాశ్రయంకు కూత వేటు దూరంలోత్రిశూలం రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న అతి పెద్ద కొండ వెనుక ఆర్మీ, కేంద్ర బలగాల శిక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ షూటర్లు తమ ప్రతిభను చాటుకుంటూ వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఆ కేంద్రం పరిసరాల్లో ఓ యువకుడు సంచరిస్తుండడంతో భద్రతా విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అందులో బంగ్లా దేశ్ ఢాకాకు చెందిన అక్తర్ అలీ(25)గా పొందు పరచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
విమానాశ్రయం కేంద్ర నిఘా అధికారులు, స్థానిక పోలీ సులు అతడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి 90 రోజుల పర్యాటక వీసాతో అతడి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు. వీసా కాలం ముగిసినా, దేశంలోని పలు నగరాల్లో పర్యటించి, చివరకు చెన్నైకు వచ్చినట్టు తేల్చా రు. పట్టుబడ్డ అక్తర్ అలీ తీవ్రవాదా? అతను రెక్కీ నిర్వహించాడా అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో అతడి వద్ద సమాచారం రాబట్టే పనిలోపోలీసులు పడ్డారు.
హెచ్చరికలు: ఓ వైపు మదురైలో డమ్మి బాంబులు, మరో వైపు త్రిశూలంలో అనుమానితుడు చిక్కిన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరిక సమాచారం అందింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాజధానిలోని అన్ని రైల్వే స్టేషన్లలో నిఘాను పెంచారు. బస్టాండ్లలో తనిఖీలు ముమ్మరంచేశారు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లకు వచ్చేప్రతి రైలును తనిఖీలు చేశారు. ప్రతి ప్రయాణికుడిని, బ్యాగ్‌లు, సూట్ కేసుల్ని క్షణ్ణంగా పరిశీలించినానంతరం అనుమతించారు.
నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అల్‌ఖైదా హెచ్చరికలతోనే కేంద్రం అలెర్ట్ ప్రకటించినట్టు, అందుకే నగరంతోపాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచామని అధికారులు పేర్కొంటున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లతో పార్శిల్ కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రయాణికులకు తంటాలు తప్పలేదు. జన సంచారం అధికంగా ఉండే అన్ని చోట్ల మఫ్టీలో సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యారు.