ఇరాక్‌లో ఐసిస్ మరో దుశ్చర్య
బాగ్దాద్: మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపారు. షియాల ఆధిపత్యమున్న కర్బాలా సిటీలో మంగళవారం బహిరంగంగా ఐసిస్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సైన్యాధికారులు అబ్బాస్ యాసిన్ హుస్సేన్, అలీ అల్–దరాజీల శిరచ్ఛేదన దృశ్యాలను వీడియో తీసి ఉగ్రవాదులు ఆన్లైన్లో పోస్టుచేశారని ‘అరా న్యూస్’ వార్తా వెబ్సైట్ వెల్లడించింది.
అమెరికా సహకారంతో దాడులుచేస్తున్న ఇరాక్ ప్రభుత్వబలగాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఐసిస్ ప్రకటించింది. దక్షిణ ఇరాక్‌లోని కర్బాలాలో ఇటీవల ఉగ్రవాదులపై సైనికదాడుల సమయంలో ఈ ఇద్దరు అధికారులు ఐసిస్‌కు చిక్కారు. మరోవైపు, అబూ బకర్ అల్–సమురాయ్ పేరు గల సైన్యాధికారిని ఐసిస్ ఉగ్రవాదులు మెడకోసి చంపేసి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మృత్యువుకు దగ్గరవుతున్న చివరిక్షణంలోనూ భయంకనబడని సైన్యాధికారి వీడియో మీడియాలో హల్చల్ చేస్తోంది.