'ఉగ్రవాదంపై ముస్లింలు జిహాద్ ప్రకటించాల్సిందే'
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, జాతివివక్ష, నరమేధానికి వ్యతిరేకంగా ముస్లింలు తప్పక జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించాల్సిందేనని ఓ ఇస్లామిక్ స్కాలర్ అన్నాడు. ఉగ్రవాదుల చర్యలు ఇస్లాం సిద్ధాంతాలకు సవాలుగా మారాయని, వీటి విషయంలో ముస్లింలంతా ఏకమై పరిష్కారం కనుగొనాలని చెప్పాడు. జమైతే ఉలేమా అల్ హింద్ సంస్థకు చెందిన స్కాలర్ మౌలానా మహ్మద్ మదానీ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో దుష్టశక్తులను సమూలంగా నాశనం చేసి మంచిని స్థాపించే సానుకూల దృక్పథం జిహాద్ ది తప్ప ఆ పేరుతో అమాయకుల ప్రాణాలను తీయడం మాత్రం దాని ఉద్దేశం కాదన్నారు.
ఉగ్రవాదంపై జిహాద్ ప్రకటించడం ప్రతి ముస్లిం దేశానికి ఉన్న కనీస బాధ్యత అని, ఇప్పటికైనా ఆయా దేశాలు ఈ విషయంలో కలిసి ముందడుగు వేయాలని చెప్పారు. సమాజంలో అసహనం అనేది ఏమాత్రం మంచిది కాదని, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి మరో 65 నగరాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలతో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. 2007 నుంచి ఈయన సంస్థ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తూనే ఉంది.