ఆసీస్ యువతులకు ఐఎస్ వల
మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్) చాప కింద నీరులా ప్రపంచమంతా పాకుతోంది. తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు పెద్ద ఎత్తున యువతను ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియా యువతులకు ఐఎస్ వల వేస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. విలాసవంతమైన జీవితం కల్పిస్తామని ఆశచూపి 18 నుంచి 20 ఏళ్ల వయసున్న యువతులను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తోందని విక్టోరియా తీవ్రవాద నిరోధక దళం వెల్లడించింది.
గత రెండు నెలల్లో ఐఎస్ వలలో పడిన డజనుపైగా ఆస్ట్రేలియా యువతులు అందులో చేరేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఐదుగురు యువతులు సిరియాకు వెళ్లారని, మరో నలుగురిని టర్కీలో అధికారులు నిలువరించారని వివరించింది. యువకులతో పోలిస్తే యువతులను సులభంగా బుట్టలో పడేయొచ్చన్న ఉద్దేశంతో వారికి ఐఎస్ ఎర వేస్తోందని తెలిపింది. ఐఎస్ మాయలో పడిన యువతులు కల్లోలిత సిరియా, ఇరాక్ లకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.