షూటింగ్లో మూడు స్వర్ణాలు
పుతియాన్ (చైనా): తొలి రెండు రోజులు నిరాశ పరిచిన భారత షూటర్లు మూడో రోజు మాత్రం అదరగొట్టారు. సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్ ఖాతాను పసిడి పతకాలతో తెరిచారు. ఒకే రోజు ఏకంగా మూడు స్వర్ణాలు నెగ్గడంతో పాటు పతకాల పట్టికలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారు. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మనూ భాకర్ 244.7 పాయింట్లతో జూనియర్ ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. మరో భారత షూటర్ యశస్విని సింగ్ ఆరో స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలవనీల్ వలరివన్ 250.8 పాయింట్లతో, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దివ్యాన్ష్ సింగ్ 250.1 పాయింట్లతో పసిడి పతకాలను గెల్చుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బరిలో దిగిన భారత షూటర్లు అభిషేక్ వర్మ, సౌరభ్ చౌదరి ఫైనల్‌కు అర్హత సాధించినా... అక్కడ వారి గురి తప్పడంతో అభిషేక్ ఐదు, సౌరభ్ ఆరు స్థానాల్లో నిలిచి పతకాలను దూరం చేసుకున్నారు.