మరో 300 ఎకరాలు కావాలి
రన్ వే విస్తరణకు అవసరమంటూ
కలెక్టర్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ లేఖ
ఇప్పటికే 465 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల
భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు
విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ సమస్య కొలిక్కి రాకముందే మరో 300 ఎకరాలు అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయించింది. ప్రస్తుతం పెంచాలని భావిస్తున్న రన్ వేను మరో 2వేల అడుగులు విస్తరించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ తాజాగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ఇప్పుడు సేకరిస్తున్న 465 ఎకరాలతోపాటు మరో 300 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. కలెక్టర్ ఆ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని తెలుస్తోంది.
ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు కేంద్ర పౌరవిమాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఎయిర్ పోర్టు విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పట్లో విస్తరణ కోసం 465 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతులు తమ భూమలు ఇచ్చేందుకు అంగీకరించడంలేదు. కొద్ది రోజులుగా అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతులతో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూములను స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రన్‌వే విస్తరణ ఇలా..
ప్రస్తుతం ఉన్న 9,500 మీటర్ల రన్‌వేను 12,500 మీటర్లకు పెంచటానికి అధికారులు భూసేకరణ చేస్తున్నారు. దాన్ని 14,500కు పెంచాలని ఎయిర్ పోర్టు అథారిటీ భావిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో కార్గో తదితర విమాన సర్వీసులకు అనువుగా రన్‌వేను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రణాళికలు రూపొందించింది.
సమస్యగా ఏలూరు కాలువ
అదనంగా 300 ఎకరాలు ఎటు నుంచి సేకరించాలని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో సేకరించటానికి రంగం సిద్ధంచేసిన 465 ఎకరాల భూములు ఏలూరు కాలువ వరకు ఉన్నాయి. దీంతో అదనంగా భూమిని సేకరించేందుకు, రన్ వేను 14,500లకు పొడిగించేందుకు ఎలూరు కాలువ అడ్డువస్తుందని భావిస్తున్నారు. ఏలూరు కాలువ డిజైన్ మార్పుపై కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టు అథారిటీ మరో 300 ఎకరాలు కోరిందనే సమాచారం బటయకు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా ఎటువైపు నుంచి భూసేకరణ చేస్తారనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.