ప్రభుత్వం వర్సెస్ వ్యవసాయశాఖ
అదనపు సంచాలకుడిగా విజయకుమార్‌ను నియమించిన సర్కారు
ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వని వ్యవసాయ శాఖ
ప్రభుత్వం జీవోకు విరుద్ధంగా అంతర్గత మెమో జారీ
హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వునే వ్యవసాయశాఖ పెడచెవిన పెట్టింది. అదనపు సంచాలకులుగా విజయకుమార్‌ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవంటూ వ్యవసాయ శాఖ అంతర్గత మెమో జారీ చేయడం వివాదాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే అంతర్గత మెమోను వెనక్కు తీసుకునేలా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి సి. పార్ధసారధిలకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పది రోజుల క్రితం వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శినికి వ్యతిరేకంగా ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమెను బదిలీ చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి విన్నవించారు. ఈ ఆందోళనల్లో ఇన్చార్జీ అదనపు సంచాలకులు విజయకుమార్ కూడా పాల్గొన్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా జేడీఏగా ఉండగానే... సీనియర్ కావడంతో ఇన్చార్జీ అదనపు సంచాలకుడిగా బాధ్యతలు అప్పగించారు.
అయితే ఈ నెల 19న ఆయనను పూర్తిస్థాయిలో అదనపు సంచాలకుడిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ 20 వ తేదీన వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం ఆయన్ను రంగారెడ్డి జేడీఏగా తప్పించి మరొకరిని నియమించింది. అలాగే, ఇన్చార్జి అదనపు సంచాలకులుగా లేరని పేర్కొంటూ విజయ్‌కుమార్‌కు ఫైళ్లు పంపరాదని ఉద్యోగులకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ డెరైక్టర్ కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారని తెలంగాణ అగ్రి డాక్టర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు విమర్శించారు. జీవో ఉన్నా అంతర్గత జీవో ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు.