మీ ఉత్సాహానికి సెల్యూట్
విజయవాడ స్పోర్ట్స్: ‘ఎంతో ఉత్సాహంగా ఎనభై ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మీ అందరికీ హ్యాట్సాఫ్తో పాటు సెల్యూట్ చేస్తున్నా‘నని ఐస్టా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్న వృద్ధ క్రీడాకారులను ఉద్దేశించి నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం జిల్లా టెన్నిస్, ఏపీ సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించిన ఐస్టా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతున్న మీరు, యువతకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. 53 ఏళ్ల తాను కూడా మీ మాదిరిగా 80 ఏళ్ల వరకు టెన్నిస్ ఆడాలని దేవునిని కోరుకుంటున్నానని అన్నారు. నూతన రాష్ట్రం, కొత్త రాజధాని స్పోర్ట్స్ సిటీగా వెలుగొందాలన్నారు. నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో రూ.2.5లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చామని, వచ్చే ఏడాది రెట్టింపు చేస్తామన్నారు. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అ«ధ్యక్షులు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, ఏపీ సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి.బుద్దరాజు, ఉపా«ధ్యక్షులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు సీపీ గౌతమ్ సవాంగ్ ట్రోఫీలను అందజేశారు.
బహుమతిగా సాక్షి కథనం
ఈ టోర్నీలో పాల్గొన్న 75 నుంచి 80 ఏళ్ల పైబడిన వారిపై ‘75+ స్టిల్ యంగ్’ అంటూ శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన ప్రత్యేక కథనంలోని ఫొటోను ఆయిల్పెయింట్లా చేయించి ఆ కేటగిరీలోని ప్రతి ఒక్కరికీSట్రోఫీలతో పాటు సీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు. తమ ఇళ్లల్లో ఫ్రేమ్ కట్టించి గోడకు పెట్టుకుంటామని వారంతా సంతోషంగా తెలిపారు.