మనదిక రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా
సాక్షి, సిటీబ్యూరో: జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను యథాతథంగా ఉంచారు. వాస్తవంగా హైదరాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రెండుగా విభజించాలని మొదట అధికార యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ విపక్షాల వ్యతిరేకతతో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద హైదరాబాద్ జిల్లా పాత ప్రాంతాలతోనే చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఇక సికింద్రాబాద్(లష్కర్) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నిరాశ అయింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు – కలెక్టర్ల పాత్ర పూర్తి నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మాణించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్ అతిపెద్ద జిల్లాగానే ఉంది. జిల్లా పరిధిలో అదనంగా మరో రెవెన్యూ డివిజన్‌తోపాటు రెండు మండలాలను పెంచాలనే యంత్రాంగం ప్రతిపాదనలకు కూడా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ జిల్లాలో పాతగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లతో సహా 16 మండలాలు యథాతథంగా ఉన్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అలాగే ఉన్నాయి.
పెరగని రెవెన్యూ డివిజన్లు, మండలాలు
హైదరాబాద్ జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరగలేదు. జిల్లా జనాభా దాదాపుగా 40 లక్షల వరకు ఉంది. మండలాల పరిధిలో కూడా జనాభా అధికంగా ఉంది. రెండు, మూడు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనలో భాగంగా అదనంగా ఒక రెవెన్యూ డివిజన్‌తో పాటు రెండు మండలాలను కొత్తగా> పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు స్థానం దక్కక పోవటంతో కొత్త రెవెన్యూ డివిజన్, మండలాలకూ మోక్షం లభించలేదని తెలుస్తున్నది. 1.50 లక్షల జనాభాకు ఒక మండలం ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...తర్వాతనైనా మండలాల పెంపునకు అవకాశం ఉండగలదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే అంశం సర్కారు నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.