కొత్త కొలువుల కళకళ...
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాబ్ మార్కెట్ ఆశావహంగా కన్పిస్తోంది. ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు జనవరిలో వరుసగా నాలుగో నెల కూడా పెరగడం ఇందుకు నిదర్శనం. దేశంలో ఆన్లైన్ జాబ్ డిమాండుకు ఓ ప్రామాణికమైన మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జనవరిలో 7 పాయింట్లు (5.18 శాతం) వృద్ధిచెంది 142 పాయింట్లకు చేరింది. వరుసగా ఆరు సంవత్సరాలు దిగువముఖంలో ఉన్న రిక్రూట్మెంట్ సూచీ గతేడాది 11 శాతం పెరగడం గమనార్హం.
ఐటీ (సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్), రిటైల్ రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని మాన్స్టర్.కామ్ ఎండీ సంజయ్ మోడీ తెలిపారు. ఉద్యోగ సూచీ గత అక్టోబర్ నుంచి క్రమంగా పెరుగుతోందని చెప్పారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, హెచ్ఆర్ కన్సల్టెంట్ల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు వివరించారు. ఐటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక సౌకర్యాలు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలు జాబ్ మార్కెట్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్‌లోనూ జోరు..
మాన్స్టర్.కామ్ సూచీ పర్యవేక్షణలోని 13 నగరాలకు గాను 11 సిటీల్లో ఆన్లైన్ జాబ్ డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి రేటు గతేడాది రెండంకెల స్థాయిలో ఉందని మాన్స్టర్.కామ్ నివేదిక పేర్కొంది. బరోడా, కోయంబత్తూరు నగరాలు మాత్రమే తిరోగమనంలో ఉన్నాయని తెలిపింది.