IT exemption
-
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐటీ మినహాయింపు పరిమితి రెట్టింపు చేయాలి
న్యూఢిల్లీ: వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలపై పన్ను మినహాయింపుల పరిమితిని పెంచాలంటూ కేంద్రాన్ని పరిశ్రమ వర్గాలు కోరాయి. ఐటీ మినహాయింపును రెట్టింపు స్థాయికి రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే పొదుపును ప్రోత్సహించే దిశగా సెక్షన్ 80సి కింద డిడక్షన్ పరిమితిని కూడా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని కోరాయి. ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి–బడ్జెట్ కోర్కెల చిట్టాలో పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతానికి తగ్గించాలి.. ప్రస్తుతం రూ. 2.5 లక్షల దాకా వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటున్నాయి. రూ. 2.5–5 లక్షల దాకా ఆదాయంపై 5 శాతం, రూ. 5–10 లక్షల దాకా 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం మేర పన్ను రేటు వర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపుల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని సీఐఐ కోరింది. ఇక రూ. 5–10 లక్షల శ్లాబ్‌లో రేటును 10 శాతానికి, రూ. 10–20 లక్షల ఆదాయంపై పన్నును 20 శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. రూ. 20 లక్షలు పైగా ఆదాయం ఉన్న వారిపై 25 శాతం పన్ను రేటు విధించాలని కోరింది. వైద్య వ్యయాలు, రవాణా అలవెన్సులకు కూడా మినహాయింపులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు కార్పొరేట్ ట్యాక్స్‌ను కూడా టర్నోవర్‌తో సంబంధం లేకుండా 25 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత క్రమానుగతంగా దీన్ని 18 శాతం స్థాయికి తేవాలని విజ్ఞప్తి చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద డిడక్షన్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచితే పొదుపు చేసేందుకు మరింత అవకాశం కల్పించినట్లవుతుందని సీఐఐ తెలిపింది. రూ. 40,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు వైద్య చికిత్స వ్యయాలు, రవాణా అలవెన్సులకు మినహాయింపులు పునరుద్ధరించాలని కోరింది. స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్‌తో దీర్ఘకాలిక మూలధన నష్టాలను సెటాఫ్ చేసుకునేందుకు అనుమతించాలని పేర్కొంది. -
మధ్య తరగతికి రాయితీలు!
* ఐటీ మినహాయింపు లేదా పన్ను రహిత పెట్టుబడి పరిమితి పెంచే చాన్స్ * గృహ రుణాల చెల్లింపులకు పన్ను రాయితీలు న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం సగటు మనిషికి నచ్చే బడ్జెట్‌ను అందించనున్నదన్న అంచనాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలకు వరాల జల్లు కురిపించేలా ఈ బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. పన్ను స్లాబ్‌లను పెంచడం, పొదుపు స్కీముల్లో పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి వరాలు ఉండొచ్చని అంచనా. వీటికి తోడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని రాయితీలు దక్కవచ్చని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులకు ఊపునివ్వడానికి పలు చర్యలు బడ్జెట్లో ఉండొచ్చని ఊహాగానాలున్నాయి. రాబడిపై దృష్టి గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే ధోరణి ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్లో చోటు చేసుకోవచ్చు. గత ఏడాది వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ పెంచారు. అలాగే పొదుపు పత్రాల్లో పన్నురహిత పెట్టుబడి పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. అయితే ఈ బడ్జెట్లో ఈ రెండింటిలో ఏదో ఒక దానినే(ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం కానీ, పన్ను రహిత పొదుపు పరిమితి పెంచడం కానీ) ఆయన ఎంచుకుంటారని విశ్లేషకులంటున్నారు. అధిక వృద్ధి సాధన కోసం ప్రభుత్వ వ్యయం అధికంగా చేయాల్సి ఉన్నందున అదనపు రాబడి సాధించడంపై అరుణ్ జైట్లీ దృష్టి సారిస్తున్నారని, అందుకని ఏదో ఒకటి మాత్రమే సాద్యమని వారంటున్నారు. ఆరోగ్య బీమా రంగంలో పన్ను మినహాయింపు పెట్టుబడుల పరిమితిని అరణ్ జైట్లీ పెంచవచ్చు. పెన్షన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులపై కూడా మినహాయింపులు ఇవ్వొచ్చు. ఇన్ఫ్రా బాండ్లకు పన్ను ఆదా మౌలిక రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతున్న నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లకు పన్ను ఆదా ప్రయోజనాలు ఉండవచ్చు. గృహరుణానికి సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులపై కూడా భారీగా పన్ను రాయితీలు చోటు చేసుకోవచ్చు. గృహ రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని గత ఏడాది రూ.2 లక్షలకు పెంచారు. సెజ్‌లకు ప్రోత్సాహాకాలు... కంపెనీలు, వ్యక్తులపై సర్‌చార్జీల విషయంలో ఆర్థిక మంత్రి గత ఏడాది ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. రూ. కోటి ఆదాయం ఉన్న వ్యక్తులు, రూ.10 కోట్ల లాభమార్జించే కంపెనీలపై ఆయన 10 శాతం సర్‌చార్జీ విధించారు. పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్(గార్)ను రెండేళ్లు వాయిదా వేస్తారని అంచనా. ఇక ప్రత్యేక ఆర్థిక మండలాలాలకు(సెజ్) పన్ను రాయితీలివ్వాలన్న ఒత్తడి ఆరుణ్ జైట్లీపై బాగా పెరుగుతోంది. చాలా సెజ్ డెవలపర్లు వాటిని నిర్వహించలేక చేతులెత్తేయడంతో పన్ను రాయితీల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇక పరోక్ష పన్నుల విషయానికొస్తే, వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని అంచనా. ఈ జీఎస్టీలో ఒకే రేటు పన్ను ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ రేటును 12 శాతం నుంచి పెంచే అవకాశాలున్నాయి. భారీగా ఉద్యోగ కల్పన * ఆ దిశగా బడ్జెట్లో చర్యలు * హెచ్ఆర్ నిపుణుల మాట జాబ్ మార్కెట్‌కు ఊపునివ్వడానికి తగిన చర్యలను, కార్మిక సంస్కరణలకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి పెద్ద పీట వేస్తారని మానవ వనరుల నిపుణులంటున్నారు. గత బడ్జెట్లో ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేక్ ఇన్ ఇండియా హోరెత్తుతున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్ వృద్ధికి తోడ్పడే చర్యలు బడ్జెట్లో ఉండొచ్చని అంచనాలున్నాయి. కార్మికుల్లో దాదాపు 94 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వీరికి ఎలాంటి సామాజిక భద్రత, ప్రయోజనాలు లేవని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. 44 కార్మిక చట్టాలను ఐదు చట్టాలుగా క్లుప్లీకరించాలని, దీంతో కార్మిక చట్టాల ఆచరణకు వీలవుతుందని, సంక్లిష్టత కూడా తగ్గుతుందని వివరించారు. దేశంలో ఉద్యోగ కల్పన పరిస్థితులకు ఊపునిచ్చే చర్యలు బడ్జెట్లో ఉండగలవన్న ఆశాభావాన్ని మాన్‌స్టర్‌డాట్‌కామ్ సంజయ్ మోడి వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా జాబ్ మార్కెట్లో సంస్కరణలు ఉండొచ్చని అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ సంస్థ అంటాల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇండియా ఎండీ, జోసెఫ్ దేవాసియా పేర్కొన్నారు. మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్ ఉంటుందని, ఫలితంగా ఈ రంగంలో భారీ ఉద్యోగాలకు అవకాశం ఉండగలదని కెల్లీ సర్వీసెస్ అండ్ ఓసీజీ ఇండియా ఎండీ కమల్ కర్నాద్ అభిప్రాయపడ్డారు.