భారీ ఐటీ మినహాయింపు ప్రకటనతో ఆప్ శిబిరంలో ప్రకంపనలు
ఢిల్లీలో 67 శాతమున్న మధ్యతరగతిపై గట్టి ప్రభావం!
మూడు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
కేజ్రీవాల్ ‘హ్యాట్రిక్’ ఆశలకు గండి?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది.
శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు.
మాస్టర్ స్ట్రోక్!
ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.
దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తన
మేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.
ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం.
కేజ్రీవాల్‌కూ ఎదురీతే!
ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు.
అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు.
నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment