![Punjab aap Government Fears Delhi Election Results](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Punjab-aap1.jpg.webp?itok=Si7AKYhI)
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలు కావడంతో పంజాబ్‌లో వణుకు మొదలయ్యింది. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సింగ్‌కు ఢిల్లీ ఫలితాలు అగ్నిపరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తర్వాత పార్టీలోనూ, పంజాబ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కాగలరని వ్యాఖ్యానించారు. ఆయన పంజాబ్ మంత్రి, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. పంజాబ్‌లో హిందువు కూడా ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు.
పంజాబ్‌లోని లూథియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలచుకుంటే అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ స్థానం నుంచి పోటీచేయించి, ముఖ్యమంత్రిని చేయవచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనపై ఆప్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్(Bhagwant Mann) ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతరం కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వాన్ని 'రిమోట్ కంట్రోల్'తో నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు
Comments
Please login to add a commentAdd a comment