Punjab assembly
-
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం భగవంత్‌మాన్
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని సర్కార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సభ్యుల గోల నడుమ, బీజేపీ సభ్యుల వాకౌట్ నిరసనల మధ్య తీర్మానం ప్రవేశపెట్టారాయన. స్పీకర్ కుల్టార్‌సింగ్ సంధ్వాన్ అసెంబ్లీలో మాన్ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేయడంతో.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాల కోసం ఆప్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని బీజేపీ, కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో.. ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈలోపు ఆప్ ప్రభుత్వం గవర్నర్ నిర్ణయంపై, కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడింది. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో.. గవర్నర్ సెప్టెంబర్ 27(ఇవాళ) నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తమ పార్టీలోని కనీసం పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాతిక కోట్ల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చి పార్టీ మార్పించేందుకు ప్రయత్నించిందని, ఆపరేషన్ లోటస్‌ను తాము భగ్నం చేశామంటూ ఆప్ ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే బలనిరూపణకు సిద్ధపడింది కూడా. అయితే పంజాబ్ బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరు నెలల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలాడుతోందని విమర్శించింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో ఈమధ్యే బలనిరూపణలో నెగ్గింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు -
అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారెంట్!
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారిలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, లల్జిత్ సింగ్ భుల్లార్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరిహద్దు జిల్లాలైన అమృత్సర్, తరన్ తరన్‌లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్, టాక్సేషన్ శాఖ మంత్రి హర్పల్ సింగ్ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
చండీగఢ్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పంజాబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంపై గత నెలలో కేరళ కూడా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఏఏను రద్దు చేయాలని అధికార కాంగ్రెస్ తీసుకు వచ్చిన ఈ తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మహింద్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.(నేను కేవలం రబ్బర్ స్టాంప్‌ను కాదు..) ‘పంజాబ్‌తో సహా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానం చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ ఉండగా రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడానికి తగిన మార్పులు చేయాలని మేము కేంద్రానికి ఒక ముసాయిదా పంపాము. ఇప్పుడు జనాభా గణన జరుగుతోంది, ఇది పాత పద్దతిలోనే జరుగుతుంది. ప్రతి పౌరుడు ముస్లిం, హిందూ, సిక్కు, క్రిస్టియన్ లేదా ఎవరైనా భారతీయ పౌరుడుగానే గుర్తింపడతారు’ అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తరువాత తెలిపారు. -
పంజాబ్ అసెంబ్లీలో చెప్పు విసిరిన విపక్షం?
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో అధికార పక్షంవైపు విపక్షం చెప్పు విసిరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్–బీజేపీ ప్రభుత్వంపై తాము తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలనిడిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు గత రెండు రోజులుగా అసెంబ్లీలో బైఠాయించారు. ఈ తీర్మానాన్ని సోమవారం నాడే మూజువాణి ఓటుతో వీగిపోయినట్లు స్పీకర్ చరణ్‌జిత్‌సింగ్ అత్వాల్ ప్రకటించారు. అయినా దానిపై చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్.. సమావేశాల చివరి రోజైన బుధవారం కూడా సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగింది. ప్రతిపక్షం వైపు నుండి ఎవరో అధికార పక్షం వైపు ఒక చెప్పు విసిరారు. -
మంత్రిపైకి షూ విసిరాడు..
న్యూఢిల్లీః పంజాబ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. మినిస్టర్ బిక్రమ్ సింగ్ మజీతియా పైకి బుధవారం అసెంబ్లీలో 'షూ' విసరడం కలకలం రేపింది. తర్లోచన్ సూంధ్ అనే కాంగ్రెస్ చట్ట సభ్యుడు తమ పార్టీ నిరసనల సందర్భంలో సభలో తన షూ విప్పి మంత్రిపైకి విసరడం పంజాబ్ అసెంబ్లీలోనే కొత్త పోకడలకు దారి తీసింది. రాష్ట్రంలోని అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు డిమాండ్ చేస్తున్న సందర్భంలో సూంధ్.. మంత్రిపైకి 'షూ' విసరడం ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తంగా మారింది. వాయిస్ ఓటు ద్వారా వారి డిమాండ్ ను తిరస్కరించినట్లు ప్రకటించడంతో సుమారు 22 మంది సభ్యులు సోమవారంనుంచీ అసెంబ్లీ భవనాన్ని విడిచి వెళ్ళలేదు. -
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు
పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నాడు సభలో తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాతి నుంచి ఇప్పటివరకు వాళ్లంతా అసెంబ్లీలోనే ఉండిపోయారు. నేలమీదే పడుకోవడం, అక్కడే బ్రష్ చేసుకోవడం.. నిరసన కొనసాగించడం.. ఇదీ ఎమ్మెల్యేల కార్యక్రమంగా మారింది. అసెంబ్లీ హాలును ఖాళీ చేసి వెళ్లాలని ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోరినా ఎమ్మెల్యేలు మాత్రం పట్టు వీడలేదు. సోమవారం సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. అధికారంలో ఉన్న అకాలీదళ్ - బీజేపీ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని ప్రతిపక్ష నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అసెంబ్లీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురులోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. తమకు తామే గాలి విసురుకుంటూ గడిపారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇదే చిట్టచివరి సమావేశం కావడంతో ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ ఈ వ్యూహం రచించింది. మంగళవారం బక్రీద్ సెలవు కాగా, బుధవారంతో అసెంబ్లీ ముగిసిపోతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లిపోయినా.. యువ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఆగిపోయారు. కాంగ్రెస్‌కు పంజాబ్‌లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 27 మంది నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరికీ పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్‌సీ నుంచి ఆహారం పంపారు. -
పాక్‌లో మోడీ వ్యతిరేక తీర్మానం!
లాహోర్: భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యతిరేక తీర్మానాన్ని పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బుధవారం అక్కడి విపక్షం యత్నించింది. పాక్‌పై తీవ్రవాద ఆరోపణలు చేసిన మోడీకి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, పీపీపీ, పీఎంఎల్‌క్యూ సభ్యులు యత్నించారు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ రాణా ఇక్బాల్ అంగీకరించకపోవడంతో భారత్, మోడీ, నవాజ్షరీఫ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా వాకౌట్ చేశారు. స్పీకర్ పరోక్షంగా మోడీకి మద్దతిస్తున్నాడంటూ ప్రతిపక్ష నేత మొహమ్మద్ ఉర్ రషీద్ ఆరోపించారు. తీర్మాన ప్రతిని మీడియాకు వినిపించారు. భారత ప్రధాని పాక్‌కు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.