IT Minister K. Taraka Rama Rao
-
నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు — KTR (@KTRTRS) October 27, 2022 ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? -
రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో నూతన ప్లాంటును నెలకొల్పింది. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న (నేడు) ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చిలో ప్లాంటులో ఉత్పత్తి మొదలైందని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం తెలిపారు. -
చంద్రబాబును తెలంగాణ తండ్రి అని అంటాడేమో: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైందని, అలా ప్రజల వద్దకు వెళ్తే అక్కడ అభివృద్ధి చూడాలని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోనియాను తెలంగాణ తల్లి అంటున్న రేవంత్ రెడ్డి గతంలో బలిదేవత అన్నాడు. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అని కూడా అంటాడేమోనని’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డిలో ఇంకా టీడీపీ వాసన పోలేదని ధ్వజమెత్తారు. ఎవరిని దేంతో కొట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం 1.31 గంటలకు పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి సమష్టి నిర్ణయాలు, పోరాటాలతో ముందుకెళ్తుందని, 2023 ఎన్నికల్లో సమష్టిగా అధికారంలోకి వస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం మానుకోవాలని, ఇక నుంచి కాంగ్రెస్ ఏకైక నినాదం ‘జై సోనియా’నే అని స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు.. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు. -
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజులపాటు జరగనున్న ఇండియా జాయ్-2019 కార్యక్రమం నవంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తూ ఇండియా జాయ్ ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇండియా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులుఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్ , మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగాలకు హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా పనిచేస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. #IndiajoyinFestival is a prestigious platform for Digital, Media & Entertainment Corporations to collaborate & innovate. With more than 30,000 visitors, the 4-day conclave is expected to serve as a springboard for Indian media, entertainment companies on the world stage. — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2019 -
నలుదిశలా ఐటీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో నలుదిశలా ఐటీ పరిశ్రమను విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భాగ్యనగరంలో ఐటీ పరిశ్రమల విస్తరణపై మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ నగరం జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఐటీ ఎగుమతుల విలువ త్వరలో రూ. లక్ష కోట్లకు చేరుకోనుందన్నారు. వృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఐటీ పరిశ్రమలను కలిగి ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు రూపొందించాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజేంద్రనగర్, బుద్వేల్ ఐటీ క్లస్టర్లలో ఇప్పటి నుంచే అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే క్లస్టర్లతోపాటు విస్తరించనున్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి... రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై నగరంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుతో రానున్న ఐదేళ్లలో లక్షల సంఖ్యలో కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ పెరుగుదల అంతా ఒక వైపే కేంద్రీకృతం కాకుండా నగరంలోని నలుమూలలకూ విస్తరిస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణలో భాగంగా అవసరమైన పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలతోపాటు సాధ్యమైన ప్రాంతాల్లో మెట్రో రైలు, ఎంఎంటీఎస్ స్టేషన్ల సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజేంద్రనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవెన్యూ, టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగం క్రియాశీలకంగా పని చేయాలన్నారు. -
రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు
♦ ఈ నెల 28 వరకు వందకుపైగా డివిజన్లలో ప్రచారం ♦ ఒకటి లేదా రెండు భారీ సభలకు సీఎం ♦ విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఈ నెల 23 (శనివారం) నుంచి 28 వరకు వందకుపైగా డివిజన్లలో రోడ్‌షోల ద్వారా ప్రచారం చేపడతారని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలతో కలసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ రోడ్‌షోలలో కనీసం 5 వేల నుంచి 10 వేల మంది వరకు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కేటీఆర్ సవాల్‌కు అనుగుణంగా వందకుపైగా డివిజన్లలో విజయం సాధించి గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని..ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్నారు. నీటి కొరత, విద్యుత్ కోతల వంటి సమస్యలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని మహేందర్‌రెడ్డి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలను గాలికి వదిలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని... బీజేపీ తన విధానాలను వీడి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మహేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్‌లో స్థానికులుగానే చూస్తామన్న సీఎం ప్రకటన వారిలో భరోసా నింపిందని.. ఆయా వర్గాల మద్దతు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై కేటీఆర్ విసిరిన సవాలుకు విపక్షాలు జవాబు చెప్పడం లేదని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారు. 23, 24 తేదీల్లో కేటీఆర్ రోడ్ షో షెడ్యూలు మంత్రి కేటీఆర్ శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గం (గచ్చిబౌలి)లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షోకు శ్రీకారం చుడతారు. కొండాపూర్, మియాపూర్, హైదర్‌నగర్ అమరావతి దేవాలయం నుంచి ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, జగద్గిరిగుట్ట బస్టాప్ చౌరస్తా, గాజుల రామారం, ఆర్ఆర్ నగర్లలో ప్రచారం నిర్వహిస్తారు. 24వ తేదీన అయ్యప్ప సొసైటీ వద్ద ప్రచారం ప్రారంభించి వివేకానంద నగర్ చౌరస్తా, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, వేంకటేశ్వరస్వామి దేవాలయం పరిసరాలు, కూకట్పల్లి, హస్మత్‌పేట, అంబేడ్కర్ చౌరస్తా, బాలానగర్, బోయిన్పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, ఐడీపీఎల్ కాలనీ చౌరస్తాలలో ప్రచారం నిర్వహిస్తారు. -
రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్
- ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించబోతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ‘భారత్‌నీతి’ సంస్థ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘సుపరిపాలన కోసం సోషల్ మీడియా’ సదస్సు శనివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు హాజైరె న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సేవలందిస్తుందో వివరించాం. దేశంలో 127 కోట్ల మంది జనాభా ఉంటే 100 కోట్ల సెల్ఫోన్లు వచ్చాయి. అందులో 30 కోట్లు స్మార్ట్ ఫోన్లు. ఈ రోజు ముఖ్యమంత్రులు, మంత్రులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు... దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫేస్బుక్ పేజీల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఫేస్బుక్ పేజీకి అత్యంత ఆదరణ ఉంది’ అని చెప్పారు. ‘వివిధ విభాగాలు కూడా ఫేస్బుక్, ట్వీటర్‌ను వినియోగిస్తుండడంతో ప్రజల వినతులను నేరుగా తీసుకుని పరిష్కరించగలుగుతున్నాయి. అవినీతిని అరికట్టేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. మంత్రులు, ముఖ్యమంత్రులతో ప్రజలు నేరుగా సంభాషించే అవకాశం కలుగుతున్నందునే ఇది సాధ్యపడుతోంది’ అని అన్నారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫేస్బుక్ ద్వారా శిక్షణ ఇప్పించాం, నిర్మల్ హస్తకళలు, గద్వాల చీరలు.. ఇలా వారి ఉత్పత్తులను ఫేస్బుక్ ద్వారా అమ్ముకునే వీలు కలుగుతోందని అన్నారు. వాటర్ గ్రిడ్తోపాటు.. ఇంటింటికీ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ అందించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ కాబోతోందని తెలిపారు. నిర్ణయాత్మకమైన పాత్ర: మురళీధర్‌రావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘సుపరిపాలన-సామాజిక మాధ్యమాలు’ అన్న విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్రస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు. ప్రభుత్వాల పనితీరులో గానీ, సమీక్ష, విశ్లేషణలోగానీ సోషల్ మీడియా సాధనంగా మారింది. దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో సోషల్ మీడియా నిర్ణయాత్మక పాత్ర నిర్వహించబోతోంది’ అని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యం వికసించడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమైంది. ఒక క్లిక్‌తో ఈ రోజు ప్రపంచాన్ని తెలుసుకునే పరిజ్ఞానం వచ్చింది. హేతుబద్ధంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.