రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్
- ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించబోతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ‘భారత్‌నీతి’ సంస్థ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘సుపరిపాలన కోసం సోషల్ మీడియా’ సదస్సు శనివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు హాజైరె న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సేవలందిస్తుందో వివరించాం. దేశంలో 127 కోట్ల మంది జనాభా ఉంటే 100 కోట్ల సెల్‌ఫోన్లు వచ్చాయి. అందులో 30 కోట్లు స్మార్ట్ ఫోన్లు.
ఈ రోజు ముఖ్యమంత్రులు, మంత్రులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు... దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫేస్‌బుక్ పేజీల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఫేస్‌బుక్ పేజీకి అత్యంత ఆదరణ ఉంది’ అని చెప్పారు. ‘వివిధ విభాగాలు కూడా ఫేస్‌బుక్, ట్వీటర్‌ను వినియోగిస్తుండడంతో ప్రజల వినతులను నేరుగా తీసుకుని పరిష్కరించగలుగుతున్నాయి. అవినీతిని అరికట్టేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. మంత్రులు, ముఖ్యమంత్రులతో ప్రజలు నేరుగా సంభాషించే అవకాశం కలుగుతున్నందునే ఇది సాధ్యపడుతోంది’ అని అన్నారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫేస్‌బుక్ ద్వారా శిక్షణ ఇప్పించాం, నిర్మల్ హస్తకళలు, గద్వాల చీరలు.. ఇలా వారి ఉత్పత్తులను ఫేస్‌బుక్ ద్వారా అమ్ముకునే వీలు కలుగుతోందని అన్నారు. వాటర్ గ్రిడ్‌తోపాటు.. ఇంటింటికీ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ అందించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ కాబోతోందని తెలిపారు.
నిర్ణయాత్మకమైన పాత్ర: మురళీధర్‌రావు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘సుపరిపాలన-సామాజిక మాధ్యమాలు’ అన్న విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్రస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు. ప్రభుత్వాల పనితీరులో గానీ, సమీక్ష, విశ్లేషణలోగానీ సోషల్ మీడియా సాధనంగా మారింది. దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో సోషల్ మీడియా నిర్ణయాత్మక పాత్ర నిర్వహించబోతోంది’ అని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యం వికసించడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమైంది. ఒక క్లిక్‌తో ఈ రోజు ప్రపంచాన్ని తెలుసుకునే పరిజ్ఞానం వచ్చింది. హేతుబద్ధంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.